
కనెక్షన్.. నిరీక్షణ
ఏళ్లుగా రైతులకు ఎదురుచూపులే.. డీడీలు చెల్లించినా పట్టింపు శూన్యం తడి అందక ఎండుతున్న పంటలు ఆందోళన చెందుతున్న అన్నదాతలు
మంచిర్యాలఅగ్రికల్చర్: వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం అన్నదాతలకు నిరీక్షణ తప్పడం లేదు. జిల్లాలో ఏటా వందల సంఖ్యలో దరఖాస్తు చేసుకుంటున్న రైతులకు ఎదురుచూపులు తప్పడం లేదు. కనెక్షన్ కోసం దరఖాస్తు చేసి డీడీలు చెల్లించి లైన్ మ్యాపింగ్, ఎస్టిమేషన్లు వేసి ఇస్తున్నా ఏదో ఓ కారణంతో రేపుమాపంటూ అధికారులు కాలయాపన చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. డీడీలు, ఎస్టిమేషన్ చార్జీలు చెల్లించినా స్తంభాలు వేసి తీగలు అమర్చకపోవడంతో పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొంది. బోరుబావులు తవ్వించుకుని ఏళ్లు గడస్తున్నా విద్యుత్ సౌకర్యం లేక నీటి తడులు అందించలేని దుస్థితి ఉంది. దరఖాస్తు చేసుకున్న రైతులకు వెంటనే కనెక్షన్లు ఇవ్వాలని విద్యుత్‌శాఖ ఉన్నతాధికారులు ఆదేశిస్తున్నారు. అయినా ఏటా వందల సంఖ్యలో కనెక్షన్లు పెండింగ్ ఉంటున్నాయి. విద్యుత్ శాఖ అధికారులు చుట్టూ రైతులు కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ప్రస్తుతం వానాకాలం సీజన్ కావడంతో మధ్యలోంచి లైన్ వేయడం కష్టంగా ఉంటుందని, యాసంగి సీజన్‌లో పంటలు ఉన్నాయని దిగుబడి వచ్చిన తర్వాత అని దాట వేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.
పరికరాలు నిర్మల్‌లోనే
వ్యవసాయ కనెక్షన్ మంజూరైన రైతులకు విద్యుత్ శాఖ కండక్టర్ వైరు (సబ్ స్టేషన్ నుంచి ట్రాన్స్‌ఫార్మర్‌కు వచ్చేది), కేబుల్ వైరు (ట్రాన్స్‌ఫార్మర్ నుంచి రైతు బావి, బోరు వరకు స్తంభాల మధ్య లాగేది) ఇస్తోంది. రైతులు తమ వ్యవసాయ కనెక్షన్లకు దరఖాస్తు చేసుకున్న సందర్భంలో ఆ దూరాన్ని బట్టి కేబుల్ వైర్, అవసరాన్ని బట్టి కండక్టర్ వైర్‌ను విద్యుత్‌శాఖ సరఫరా చేయాల్సి ఉంటుంది. గతంలో విద్యుత్ పరికరాలు సరఫరా చేసే స్టోర్ ఉమ్మడి జిల్లాలో ఒక్క నిర్మల్‌లోనే ఉండడం, లైన్లు వేయడానికి అవసరం మేరకు పరికరాలు దొరకక జాప్యం జరుగుతుండేది. దీంతో వ్యవసాయ కనెక్షన్లు పెండింగ్‌లో ఉండేవి. కానీ.. ఐదేళ్ల క్రితం జిల్లాలో కొత్త స్టోర్ ఏర్పాటు చేయడంతోపాటు పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. ప్రభుత్వం స్తంభాలతో పా టు పెద్ద మొత్తంలో కేబుల్, కండక్టర్ తదితర సమగ్రిని పెద్ద ఎత్తున అందుబాటులో ఉంచడంతో పాటు అంతా పారదర్శకంగా ఉండేందుకు దరఖా స్తులు, మంజూరు, చెల్లింపులు విద్యుత్ శాఖ వెబ్‌సైట్ అన్ని ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. వ్యవసాయ మోటర్లకు లైన్ ఇవ్వడంలో మాత్రం కాలయాపన కొనసాగుతోంది. ఆలస్యం చేయకుండా వెంటనే కనెక్షన్లు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.
జిల్లాలో గత ఐదేళ్లలో కనెక్షన్ వివరాలు
సంవత్సరం దరఖాస్తులు మంజూరు తిరస్కరణ పెండింగ్
2021 3,606 2381 590 635
2022 2,371 1,177 298 896
2023 2,856 1,426 577 853
2024 3,369 1,780 854 735
2025 2,156 977 678 501
(సెప్టెంబర్ 30)
పెండింగ్‌లో ఉంచడం లేదు
వ్యవసాయ కనెక్షన్ల కోసం మీసేవ ద్వారా డీడీ చెల్లించిన రైతులు ఎస్టిమేషన్ ఇచ్చిన తర్వాత స్తంభాలు, తీగలు, పరికరాలకు చార్జి ఆన్‌లైన్ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. రైతులు ఆలస్యం చేస్తే కనెక్షన్ ఇవ్వడం ఆలస్యమవుతుంది. పారదర్శకంగా కనెక్షన్లు ఇస్తున్నాం. ప్రస్తుతం వానాకాలం పంటలు వేసుకున్నారు. పంట పొలాల మధ్యలో నుంచి లైన్ వేయడం కుదరదు. ఇబ్బంది లేని చోట వెంటనే ఇస్తున్నాం. కనెక్షన్లు ఇవ్వాలని ఉన్నతాధికారుల ఆదేశాలు వస్తున్నాయి. పెండింగ్‌లో ఉంచకుండా చర్యలు తీసుకుంటున్నాం.
– ఖైసర్, మంచిర్యాల డీఈ