
హాస్టళ్లలో ఎఫ్‌ఆర్‌ఎస్
మంచిర్యాలఅర్బన్: సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులు, సిబ్బందికి ఫేషియల్ రికగ్నిషన్ విధానా(ఎఫ్‌ఆర్‌ఎస్)న్ని అమలులోకి తెచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే పాఠశాలలు, కళాశాలల్లో బోధన, బోధనేతరులు, విద్యార్థులకు ఈ విధానం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో విద్యార్థులు, సిబ్బంది హాజరు నిజసమయంలో ట్రాక్ చేయటా నికి, అవకతవకలకు అడ్టుకట్టవేసేందుకు చర్యలు చేపట్టింది. ఈ విధానంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్ల విద్యార్థుల ఫొటోలు తీసి, ఆధార్, ఫోన్ నంబర్, చిరునామా, తరగతి తదితర వివరాలు యాప్‌లో అప్‌లోడ్ చేయనున్నారు. యాప్‌లోని మొబైల్ ఫోన్ పరికరాల్లో విద్యార్థి ముఖం చూపిస్తే హాజరు నమోదవుతుంది. ఏరోజు ఎంతమంది విద్యార్థులున్నారు?.. మిగతావారు ఎందుకు రాలేదు? హాజరు సంబంధ సమాచారంతోపాటు హాస్టల్ సంక్షేమ అధికారుల అలసత్వం, నిర్వహణ లోపాలు తెలవనున్నాయి. తద్వారా అధికారులు చర్యలు చేపట్టే అవకాశముంది. ఈ విధానంతో బోగస్ హాజరుకూ చెక్ పడనుంది.
కొరవడిన పర్యవేక్షణ
సంక్షేమ హాస్టళ్లలో పర్యవేక్షణ కొరవడడంతో నిర్వహణ ఇష్టారాజ్యంగా మారింది. సాంకేతికతో ముందుకు వెళ్తున్న తరుణంలో (ఆన్‌లైన్ హాజరు అమలులోకి ఉన్నప్పటికీ) పాత పద్ధతితో (మాన్యువల్ రిజిస్టర్) సరిపెడుతున్నారు. దీంతో ఎంత మంది విద్యార్థులు వసతిగృహాల్లో ఉంటున్నారు?.. ఎంత మంది బయటకు వెళ్లారో లెక్క తేలడం లేదు. వసతిగృహాల్లో విద్యార్థులు తక్కువగా ఉన్నా.. ఎక్కువ చూపుతున్నారనే ఆరోపణలు లేకపోలేదు. జిల్లాలో ఎస్సీ ప్రీమెట్రిక్ వసతి గృహలు 17, పోస్టుమెట్రిక్ వసతి గృహాలు ఎనిమిది ఉన్నాయి. ప్రీమెట్రిక్‌లో 1,208 మంది, పోస్టుమెట్రిక్‌లో 910 మంది వరకు విద్యార్థులున్నారు. 18 బీసీ పోస్టు మెట్రిక్, పోస్టు మెట్రిక్ వసతిగృహాల్లో 1,420 మంది విద్యారులుంటున్నారు. 16 ఎస్టీ ఆశ్రమ పాఠశాల్లో 2,600 మంది విద్యార్థులున్నారు. ఎస్టీ సంక్షేమ హాస్టళ్లలో గతేడాది ఎఫ్‌ఆర్‌ఎస్ ప్రక్రియ ప్రారంభించినా నామమాతంగా అమలవుతోంది. దీంతో విద్యార్థుల హాజరుపై పర్యవేక్షణ లేకుండా పోతోంది.
లెక్క పక్కాగా..
ఎఫ్‌ఆర్‌ఎస్ అమలులోకి వస్తే వసతిగృహాల్లో సంక్షేమాధికారులు, సిబ్బంది విధులకు డుమ్మా కొట్టేందుకు ఆస్కారముండదు. జిల్లాలో కొంతమంది వసతిగృహాల అధికారులు స్థానికంగా ఉండడంలేదు. వీలు దొరికనప్పుడల్లా వసతిగృహాలకు వెళ్లిరావటం.. కింది స్థాయి సిబ్బందితో పనులు చక్కబెట్టుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ఇదివరకు నిఘా కెమెరాలు ఏర్పాటు చేసినా నిర్వహణ లేక మూలన పడ్డాయి. కళాశాలలో మాదిరిగా ప్రభుత్వ వసతిగృహ విద్యార్థులకు భద్రత, సంక్షేమ పథకాలు పారదర్శకంగా అందేలా నిఘా నేత్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఎఫ్‌ఆర్‌ఎస్ ద్వారా విద్యార్థుల సంఖ్య, భోజన సమయంలో హాజరు, వసతిగృహ అధికారులు, సిబ్బంది ఎఫ్‌ఆర్‌ఎస్ ముందు నిలబడితే తెలిసిపోనుంది. భోజనంలో అవకతవకలు, విద్యార్థుల లెక్కల్లో తికమకకు తెరపడనుంది.