
విడిచి ఉండలేక‘పోయారు’!
జ్వరంతో బాలుడు మృత్యువాత
బర్త్‌డే రోజు శీతలపానీయంలో పురుగులమందు తాగి తల్లిదండ్రులు, సోదరి ఆత్మహత్యాయత్నం
చికిత్స పొందుతూ ఒక్కొక్కరిగా మృతి
రెండు నెలల వ్యవధిలో నలుగురు..
మంచిర్యాలక్రైం: చిన్న కుటుంబం.. భార్యాభర్తలు.. ఇద్దరు పిల్లలు.. జీవితం ఆనందంతో సాగిపోతోంది. ఒక్కగానొక్క కుమారుడు.. ఒకే కూతురు కావడంతో కంటికి రెప్పలా చూసుకున్నారు. వారిద్దరే సర్వస్వమని ఏ లోటూ రాకుండా పెంచసాగారు. వారి ఆనందమయ జీవనంపై విధి చిన్నచూపు చూసింది. కుమారుడిని జ్వరమై మృత్యువు కబళించింది. అతడిని విడిచి ఉండలేక తల్లిదండ్రులు, సోదరి ఆత్మహత్యాయత్నం చేసి ఒక్కొక్కరిగా ముగ్గురూ మృత్యువాతపడ్డారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్న ఈ సంఘటన స్థానికంగా విషాదం మిగిల్చింది. వివరాలిలా ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని రాజీవ్‌నగర్‌కు చెందిన బండి చక్రవర్తి ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఆయనకు భార్య దివ్య, కుమారుడు పవన్, కూతురు దీక్షిత ఉన్నారు. రెండు నెలల క్రితం పవన్(12) జ్వరంతో మృతిచెందాడు. ఈ సంఘటన కుటుంబ సభ్యులను తీవ్రంగా కలిచివేసింది. తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఈ నెల 5న పవన్ బర్త్‌డే కావడంతో కేక్, కూల్‌డ్రింక్ తెచ్చుకుని ఏర్పాట్లు చేశారు. గడ్డిమందు, పురుగుల మందు కూల్‌డ్రింక్స్‌లో కలుపుకొని ముగ్గురూ తాగారు. విషయం తెలిసిన చక్రవర్తి తమ్ముడు బండి ఓంకార్ వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాడు. చికిత్స పొందుతూ ఈ నెల 8న దీక్షిత(10), వరంగల్ ఎంజీఎంలో 11న దివ్య(29), బుధవారం చక్రవర్తి(32) చనిపోయారు. పవన్‌ను విడిచి ఉండలేక ముగ్గురూ మృతిచెందడం స్థానికంగా విషాదం నింపింది. ఓంకార్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు మంచిర్యాల సీఐ ప్రమోద్‌రావు తెలిపారు.