
లొంగుబాటు దిశగా మావోయిస్ట్ నేత బండి ప్రకాష్
మందమర్రిరూరల్: మావోయిస్టు కీలక నేత, సికాస కార్యదర్శి బండి ప్రకాష్ ఉరఫ్ బండి దాదా లొంగుబాటుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మందమర్రి పట్టణానికి చెందిన ఆయన గత నాలుగు దశాబ్దాలుగా అజ్ఞాతంలో ఉన్నారు. ఆర్‌ఎస్‌యూతో మొదలైన ప్రస్థానం సికాస కార్యదర్శి, మావోయిస్టు కీలక నేతగా ఎదిగాడు. అనేక సందర్భాల్లో ఎదురుకాల్పుల్లో మరణించాడని ప్రచారం జరిగినప్పటికీ క్షేమంగానే ఉన్నాడు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులపై ఉక్కుపాదం మోపి ఒత్తిడి తీసుకొస్తుండడం, వరుస ఎన్‌కౌంటర్ల దృష్ట్యా మావో యిస్టు కేంద్ర కమిటీ సభ్యులు, కీలక నేతలు లొంగుబాటు బాట పట్టడం తెలిసిందే. బుధవారం అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్‌రావు 60మంది సహచరులతో లొంగిపోయిన విషయం తెలిసిందే. ఇదే తరహాలో మరికొందరు కూడా లొంగుబాటు బాట పట్టినట్లు సమాచారం. ఇదే బాటలో బండి ప్రకాష్ రాష్ట్ర పోలీసు బాస్‌లకు అందుబాటులోకి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.