
● 16న ఏఐసీసీ పరిశీలకుల రాక ● పార్టీ నాయకులతో అభిప్రాయాల
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: జిల్లా కాంగ్రెస్ కమిటీ(డీసీసీ) అధ్యక్ష పీఠానికి నాయకుల్లో పోటీ నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడడంతో అధికార కాంగ్రెస్ పార్టీలో సంస్థాగత ఎన్నికల సందడి మొదలైంది. ఇప్పటికే గ్రామాలు, మండలాలు, బ్లాక్ స్థాయిలో పదవుల్లో ఎంపిక కసరత్తు పూర్తయింది. ఇప్పటికే ఓ దఫా కసరత్తు జరిగింది. అయితే జిల్లా అధ్యక్ష బాధ్యతల అప్పగింతకు మరోసారి అభిప్రాయ సేకరణ జరగనుంది. ఈ నెల 16నుంచి ఏఐసీసీ పరిశీలకులు నరేశ్‌కుమార్ జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలు, నాయకులు, తాజా, మాజీ ప్రజాప్రతినిధులతోపాటు పార్టీ విభాగాలకు చెందిన వారితో జిల్లా కొత్త సారథిపై నేరుగా వివరాలు సేకరించనున్నారు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాకూ ఇన్‌చార్జిగా ఉన్న నేపథ్యంలో గత రెండ్రోజులుగా ఆ జిల్లా నాయకులతో అభిప్రాయాలు సేకరిస్తున్నారు. ఈ క్రమంలో జిల్లా బాధ్యతలు అప్పగించేందుకు ముగ్గురు పేర్లతో జాబితా సిద్ధం చేసేందుకు పార్టీ కేడర్‌ను భాగస్వామ్యం చేసేలా పార్టీ నిర్ణయించింది.
ఆ ముగ్గురి పేర్లు ఎవరివో..?
గత పదేళ్లుగా ప్రతిపక్ష పార్టీగా ఉండి ప్రస్తుతం అధికారంలోకి రావడంతో పార్టీ పదవులపై గంపెడాశలు పెట్టుకున్నారు. రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవులు సైతం ఎవరికీ పెద్దగా దక్కలేదు. ఈ క్రమంలో సీనియర్ నాయకులు తమకు పదవులు ఇవ్వాలని కోరుతున్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు(పీఎస్సార్) వర్గీయులైన రాజీవ్‌గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న దండేపల్లి మండలం కొత్త మామిడిపల్లికి చెందిన గడ్డం త్రిమూర్తి, నూకల రమేశ్ డీసీసీ అధ్యక్ష పదవి ఆశిస్తున్నారు. ఇక బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి కార్కూరి రాంచందర్ పోటీలో ఉన్నారు. చెన్నూర్ నియోజకవర్గం నుంచి సీనియర్ నాయకుడిగా ఉన్న పిన్నింటి రఘునాథ్‌రెడ్డి డీసీసీ అధ్యక్ష బాధ్యతలు తనకే అప్పగించాలని కోరుతున్నారు. వీరితోపాటు పలువురు సీనియర్లు దరఖాస్తు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్ బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరాక తనకు పదవి దక్కలేదనే నిరాశలో ఉన్నారు. తనకు అవకాశం కల్పిస్తే జిల్లా బాధ్యతలు చూస్తానని చెబుతున్నారు. కాగా, ఏఐసీసీ పరిశీలకులు జిల్లా నుంచి అభిప్రాయాలు సేకరించిన తర్వా త ముగ్గురు పేర్లతో జాబితా పంపించనున్నారు.
సురేఖకు మళ్లీ అవకాశం కల్పించేనా?
ప్రస్తుతం డీసీసీ అధ్యక్షురాలిగా ఉన్న కొక్కిరాల సురేఖ సుమారు ఏడేళ్లుగా పార్టీ జిల్లా బాధ్యతలు చూస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ప్రస్తుతం మరోసారి పార్టీ అధిష్టానం అవకాశం కల్పిస్తుందా..? లేదా..? అనేది తేలాల్సి ఉంది. డీసీసీ హోదాలో రెండుసార్లు కంటే ఎక్కువగా ఉండరాదు. ఈ క్రమంలో ఆమెకు బదులు ఎవరైనా కొత్తవారికి అవకాశం కల్పిస్తారా..? లేదా..? ఎమ్మెల్యే పీఎస్సార్‌కు మంత్రి పదవి రాకపోవడంతో ఆ లోటును ఇలా భర్తీ చేస్తారా..? అనేది పార్టీ అధిష్టానం నిర్ణయించనుంది.
ఎమ్మెల్యేల్లో కుదరని సఖ్యత
జిల్లాలో మూడు ప్రధాన నియోజకవర్గాలైన మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్‌లో ఎమ్మెల్యేలుగా పీఎస్సార్, వినోద్, మంత్రి వివేక్ ఉన్నారు. వీరంతా ఎవరికి వారే వర్గపోరుతో ఉన్నారు. మంత్రి పదవి విషయంలో మొదలైన రగడ మొన్నటి దేవాపూర్ సిమెంటు ఫ్యాక్టరీ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల దాకా రగులుతూనే ఉంది. ఇప్పటికీ ముగ్గురు కలిసి ఏ వేదిక, కార్యక్రమం పంచుకోకపోగా.. సమీక్ష, సమావేశాలు నిర్వహించలేని పరిస్థితి ఉంది. జిల్లాలో మంత్రిగా వివేక్ ఉన్నప్పటికీ ఆయన కేవలం చెన్నూర్‌కే పరిమితం అవుతున్నారు. ఎవరికి వారే అన్నట్లుగా ఉన్న ఈ క్రమంలో కొత్తగా నియామకం అయ్యే డీసీసీ అధ్యక్ష స్థానానికి ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసే సమర్థులను ఎంపిక చేయాలని కార్యకర్తలు కోరుతున్నారు.