
‘మందు’కొడిగా దరఖాస్తులు
మంచిర్యాలక్రైం: జిల్లాలో మద్యం దుకాణాలకు టెండర్ దరఖాస్తుల ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త మద్యం పాలసీకి ప్రభుత్వం టెండర్లు ఆహ్వానిస్తోంది. జిల్లాలోని 73 మద్యం దుకాణాలకు గాను గత నెల 26 నుంచి ఎకై ్సజ్ శాఖ అధికారులు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ నెల 18 నాటితో దరఖాస్తు గడువు ముగియనుంది. ఇంకా నాలుగు రోజుల గడువు మాత్రమే ఉండగా.. ఇప్పటికీ అధికారులు ఆశించిన స్థాయిలో టెండర్లు రాకపోవడంతో ఎకై ్సజ్ శాఖ అధికారులు ఆలోచనలో పడ్డారు. దరఖాస్తుల సంఖ్య పెరిగేలా ఆ శాఖ అధికారులు తమ పరిధి దాటి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ నెల 11న రెండో శనివారం ప్రభుత్వ సెలవు దినం అయినప్పటికీ ఎకై ్సజ్ అధికారులు పని దినంగానే ప్రకటించారు. 73 దుకాణాలకు గాను సోమవారం వరకు 42 టెండర్లు మాత్రమే రావడంతో అధికారులు తల పట్టుకుంటున్నారు. ఒక్కో దుకాణానికి ఒక్కటైనా రాకపోవడంతో.. ఎలాగైనా గతంలో కంటే ఎక్కువ సంఖ్యలో వచ్చేలా ఎవరి స్టేషన్ పరిధిలో వారీగా సీఐలు, ఎస్సైలు పాత వ్యాపారులు, కొత్తగా వ్యాపారంలోకి రావాలనే ఆలోచన కలిగిన వారిని ప్రోత్సహిస్తున్నారు. ఫోన్లు చేస్తూ, వాట్సాప్ ద్వారా ప్రచారం చేస్తూ ఇంకా నాలుగు రోజులే గడువు ఉందంటూ గుర్తు చేస్తున్నారు.
సిండికేటుకు యత్నాలు
జిల్లాలో గతంలో మద్యం వ్యాపారం చేసిన వారు, లిక్కర్‌డాన్‌లుగా పేరొందిన వారు దుకాణాలు దక్కించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. సిండికేటుగా ఏర్పడి ఆచితూచి దరఖాస్తులు వేస్తున్నారు. గతంలో ఒక్కో వ్యాపారి 20 నుంచి 50కి పైగా టెండర్లు సమర్పించగా.. ఇప్పుడు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోకుండా సులువుగా దుకాణాలు దక్కించుకునేలా సిండికేటుగా ఏర్పడి టెండర్లు వేస్తున్నట్లు సమాచారం. ఫలితంగా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడే అవకాశాలున్నాయి. దరఖాస్తు ఫీజు రూ.3లక్షలు ఉండడంతో పలువురు భాగస్వామ్యంతో టెండర్లు వేస్తున్నారు. లిక్కర్ వ్యాపారంలో ఏళ్ల తరబడిగా కొనసాగుతున్న మరికొందరు రూ.3లక్షలు పెద్ద లెక్క కాదని భావిస్తున్నారు. కానీ డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో మద్యం దుకాణాలు దక్కించుకోవాలని వ్యూహం పన్నుతున్నారు. ఈసారి ప్రభుత్వ ఉద్యోగులు, డాక్టర్లు, పోలీసు శాఖ, రెవెన్యూ శాఖలో పని చేసే ఉద్యోగులు బినామీ పేర్లతో టెండర్లు వేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా టెండర్లు అధిక సంఖ్యలో వచ్చేందుకు వివిధ రకాలుగా ప్రచారం చేస్తున్నారు.
పెరిగిన ఫీజు, స్థానిక ఎన్నికలు కారణమా..?
మద్యం టెండర్ల నోటిఫికేషన్, స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడం, దసరా పండుగ రావడంతో చాలామంది రియల్టర్లు, మద్యం వ్యాపారులు ఎన్నికల బరిలో దిగేందుకు సిద్ధమయ్యారా..? లేక దసరా పండుగ తర్వాత వేద్దామనుకుని ఆగిపోయారా..? దరఖాస్తు ధర గతం కంటే రూ.లక్ష పెంచడంతో వెనుకడుగు వేశారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కారణం ఏమిటనే చర్చ జరుగుతోంది. గత టెండర్ల సమయంలో నాలుగు రోజుల గడువు ముందు వరకు సుమారు 500కు పైగా దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. అప్పట్లో జిల్లాలో 73 దుకాణాలకు గాను 2,242 టెండర్లు దాఖలయ్యాయి. ఈసారి ఆశించిన స్థాయిలో రాకపోవడంతో ఎకై ్సజ్ శాఖ అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. చివరికి స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడడంతో ఈ నాలుగు రోజుల వ్యవధిలో మూహూర్తం చూసుకుని భారీగా టెండర్లు వేసే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లా వివరాలు
స్టేషన్ దుకాణాలు దరకాస్తులు
మంచిర్యాల 26 20
లక్సెట్టిపేట 12 10
బెల్లంపల్లి 25 06
చెన్నూర్ 10 06
మొత్తం 73 42