
మొక్కుబడిగా పోషణ మాసోత్సవం
అంతంత మాత్రంగానే అవగాహన కార్యక్రమాలు
దసరా సెలవులు, బీఎల్‌వో విధులతో ఆటంకం
చిన్నారుల్లో పోషకాహార లోపాలు
మంచిర్యాలటౌన్: చిన్నారులు, గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికల్లో పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు ప్రభుత్వం ఏటా నిర్వహిస్తున్న పోషణ మాసోత్సవం జిల్లాలో మొక్కుబడిగా సాగుతోంది. గత నెల 17న ప్రారంభం కాగా.. ఈ నెల 16వరకు నిర్వహించాల్సి ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బూత్ లెవల్ అధికారులుగా అంగన్‌వాడీ టీచర్లకు అదనపు విధులు కేటాయించడం, దసరా పండుగకు సెలవుల నేపథ్యంలో పోషణ మాసం నిర్వహణకు ఆటంకం ఏర్పడింది. లక్సెట్టిపేట, బెల్లంపల్లి ప్రాజెక్టుల పరిధిలో ప్రజలను భాగస్వామ్యం చేస్తూ పౌష్టికాహారంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మంచిర్యాల, చెన్నూర్ ప్రాజెక్టుల పరిధిలో అంతంత మాత్రంగానే సాగుతోంది. జిల్లాలో 969 అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలో 4,245మంది గర్భిణులు, 3,186 మంది బాలింతలు, 39,229మంది చిన్నారులు ఉన్నారు. 39,229 మంది చిన్నారులను పరీక్షించి 1,282మంది తీవ్ర పోషకాహార లోపం, 199మంది అతి తీవ్ర పోషకాహారలోపంతో బాధపడుతున్నట్లు గుర్తించారు. గర్భిణుల ఆరోగ్య రక్షణ, రక్తహీనత నివారణ, పిల్లల పెరుగుదల పర్యవేక్షణ, పరిశుభ్రత వంటి పలు అంశాలపై అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంది. బాలికలకు పోషకాహారం ప్రాముఖ్యత, పౌష్టికాహారం లేకపోతే ఎదురయ్యే రుగ్మతలపై అవగాహన కల్పించాలి. కానీ ఈ ఏడాది పూర్తి స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించడం లేదు.
రోజుకో కార్యక్రమం
పోషణ మాసం పురస్కరించుకుని ప్రతీ అంగన్‌వాడీ కేంద్రంలో నెల రోజులపాటు రోజుకో కార్యక్రమం చేపట్టాలి. గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజల భాగస్వామ్యంతోనే అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, పిల్లల ఎత్తు, బరువు, కొలతలు సేకరించడం, గర్భిణుల బరువు, భుజం కొలతలను తీసుకోవడం, పోషకాహారంపై అవగాహన కల్పించి, రోగ నిరోధక శక్తిని పెంచడంపై దృష్టి సారించాలి. చిన్నారుల గ్రోత్ మానిటరింగ్‌లో తక్కువ బరువు ఉన్న పిల్లలకు వైద్య పరీక్షలు, మందులు, బాలామృతం, బాలామృతం ప్లస్ పంపిణీ చేసి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇవ్వాలి. ‘మీరు తినే ఆహారం మీ పెరుగుదల’ అనే అంశంపై పాఠశాలల్లో విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్ పోటీలు, ఆహార సమూహాలు, విటమిన్లు, రక్తహీనత, పరిశుభ్రతపై పలు కార్యక్రమాలు నిర్వహించి, హ్యాండ్‌వాష్ ప్రదర్శనలు, తల్లిదండ్రులతో సమావేశాలు, పిల్లల ఎదుగుదలకు అవసరమైన పౌష్టికాహారంపై నెలంతా కార్యక్రమాలు నిర్వహించాలి. నెలంతా ప్రతీ అంగన్‌వాడీ కేంద్ర పరిధిలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, సెక్టార్ల వారీగా కూడా చేపట్టకపోవడం, చివరి మూడు రోజుల్లో ప్రాజెక్టుల వారీగా ఒకేసారి నిర్వహించేలా అధికారులు ఏర్పాటు చేస్తుండడం గమనార్హం.