
వందేళ్ల సమస్య తీర్చిన కలెక్టర్‌కు సన్మానం
నస్పూర్: జన్నారం మండలం మహ్మదాబాద్ గ్రామంలో వందేళ్ల భూసమస్యను పరిష్కరించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్‌ను గ్రామస్తులు సోమవారం కలెక్టరేట్‌లో శాలువాతో ఘనంగా సన్మానించారు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని చింతగూడ శివారు సర్వేనంబరు 98లో 457 ఎకరాల భూమిని ప్రభుత్వం చింతగూడ, మహ్మదాబాద్ గ్రామస్తులకు అసైన్డ్ చేసింది. కానీ రికార్డుల్లో 457 ఎకరాలకు బదులు 658 ఎకరాలు చూపిస్తోంది. సుమారు 200 ఎకరాల భూమి ఎక్కువగా చూపిస్తుండడంతో ఆయా గ్రామాల్లోని భూ హక్కుదారులకు బదలాయింపులో సమస్యలు తలెత్తాయి. వారసులకూ హక్కులు సంక్రమించకుండా పోయాయి. కలెక్టర్ చొరవ చూపి ఎంజాయ్‌మెంటు సర్వేకు ఆదేశించి పూర్తయ్యేలా చూశారు. ఎలాంటి అభ్యంతరాలు లేకుండా పూర్తవడంతో వందేళ్లుగా పరిష్కారం కాని సమస్యకు పరిష్కారం చూపారని, 170 కుటుంబాలకు చెందిన భూ సమస్యను పరిష్కరించారని మహ్మదాబాద్ గ్రామస్తులు సోమవారం కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలియజేసి శాలువాతో సన్మానించారు. కలెక్టర్ మాట్లాడుతూ భూభారతి చట్టంలో భాగంగా రెవెన్యూ సదస్సుల్లో భూ సంబంధిత సమస్యలపై వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి రికార్డులు మొఖా, సర్వేనంబర్లు ఇతర పూర్తి వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు.