
మళ్లీ బెబ్బులి అలజడి
దహెగాం మండలంలో పెద్దపులి సంచారం మరో 20 రోజుల్లో పత్తి తీత పనులు ప్రారంభం ఆందోళనలో సమీప గ్రామాల ప్రజలు
దహెగాం: రెండు సంవత్సరాలుగా పులి అలజడి లేక దహెగాం మండలం స్తబ్దతగా ఉంది. ఇటీవల మండలంలోని బీబ్రా, పెసరికుంట గ్రామాల సమీపంలో పంట చేలలో పులి పాదముద్రలు కనిపించడంతో రైతులు, సమీప గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. సోమవారం పెసరికుంట బస్టాప్ సమీపంలో పంట పొలాల వద్ద పులి పాదముద్రలు గమనించిన రైతులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. టైగర్ ట్రాకింగ్ టీం సభ్యులు గ్రామానికి చేరుకుని పరిశీలించి పులి పాదముద్రలేనని నిర్థారించారు. పులి ఎటు వైపు వెళ్లిందోనని సభ్యులు ట్రాకింగ్ చేపట్టారు. పెసరికుంట, బీబ్రా వైపు వచ్చింది కొత్త పులి అని అటవీశాఖ అధికారులు పేర్కొంటున్నారు. మహారాష్ట్ర నుంచి సిర్పూర్(టీ), కడంబా, ఈస్‌గాం మండలం సార్సాల మీదుగా బీబ్రా వైపు వచ్చిందని, బీబ్రా నుంచి భీమిని మండలం చినగుడిపేట వైపు వెళ్లినట్లు అటవీశాఖ అధికారులు పేర్కొన్నారు. కాగా మండలంలోని మురళీగూడ, పోలంపల్లి, జెండాగూడా, దుబ్బగూడ గ్రామాల ప్రజలు, రైతులు భయాందోళన చెందుతున్నారు.
మరో ఇరవై రోజుల్లో పత్తి తీత పనులు..
మరో ఇరవై రోజుల్లో మండలంలో పత్తి తీత పనులు ముమ్మరం కానున్నాయి. పులి సంచారంతో రైతులు, కూలీలు భయాందోళన చెందుతున్నారు. 2021 నవంబర్‌లో దహెగాం మండలంలోని దిగిడ గ్రామానికి చెందిన సిడాం విగ్నేష్, పెంచికల్‌పేట్ మండలం కొండపల్లి గ్రామానికి చెందిన మహిళా కూలీ, 2023 నవంబర్‌లో వాంకిడి మండలం ఖా నాపూర్ గ్రామానికి చెందిన ఒకరు, ఈస్‌గాం మండలం నజ్రుల్ నగర్ వద్ద మహిళ పెద్దపులి దాడిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రతీ సంవత్స రం పత్తి తీత పనులు ప్రారంభ సమయంలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. అటవీశాఖ అధికారులు స్పందించి పులి బారి నుంచి రక్షణకు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.