
‘గీత’ గీయకున్నా.. రాత మారింది
మంచిర్యాలక్రైం: మంచిర్యాల కల్లు గీత పారిశ్రామిక సహకార సంఘంలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. కల్తీ కల్లు దందాతోపాటు సభ్యత్వం పేరిట రూ.లక్షలు వసూలు చేస్తున్నారు. చెట్టు ఎక్కక పోయినా.. గీత గీయక పోయినా అనర్హులకు సభ్యత్వం కల్పిస్తున్నట్లు తెలిసింది. ఇందుకు ఒక్కొక్కరి నుంచి రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఇదంతా సంఘంలోని ఓ బడా నాయకుని కనుసన్నల్లో జరుగుతున్నట్లు తెలిసింది. జిల్లా వ్యాప్తంగా 883మంది కల్లు గీత కార్మికులున్నారు. ఒక్క మంచిర్యాల సొసైటీలో 39మంది ఉండగా ఇందులో 30మందికి పెన్షన్ అందుతోంది. ఇందులో సగానికి పైగా అనర్హులుండడం గమనార్హం.
స్థానికంగా లేని 44మందికి సభ్యత్వం
నిబంధనల ప్రకారం తాటిచెట్టు ఎక్కితేనే సొసైటీలో సభ్యత్వం ఇవ్వాలి. 30 మందితో ప్రారంభమైన మంచిర్యాల సొసైటీ ప్రస్తుతం వందమందికి చేరింది. కానీ, అధికారుల రికార్డుల ప్రకారం 39మంది సభ్యత్వం ఉన్నట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు చెబు తున్నారు. ఈ ఏడాది కొత్తగా స్థానికంగా లేని 44 మందికి సభ్యత్వం ఇచ్చినట్లు సొసైటీ సభ్యులే ఆరోపిస్తున్నారు. ఆదిలాబాద్, జగిత్యాల తదితర ప్రాంతాల్లో వైద్యవృత్తిలో కొనసాగుతున్న వారికి, మైనర్లకు, అర్హత లేనివారికి సభ్యత్వం కల్పించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జిల్లా వ్యాప్తంగా అనర్హులెందరో!
సొసైటీలో సభ్యత్వం ఉంటే గీత కార్మికుడిగా గుర్తింపు ఉన్నట్లే. 50 ఏళ్లు నిండిన గీత కార్మికుడికి అప్పటి కేసీఆర్ ప్రభుత్వం 2015 నుంచి రూ.2,016 పెన్షన్ ఇస్తోంది. మంచిర్యాల సొసైటీలో 30మంది పెన్షన్ పొందుతుండగా ఇందులో సగానికి పైగా అనర్హులే ఉన్నట్లు తెలిసింది. ఈ లెక్కన ఒక్కొక్కరు 11 ఏళ్ల నుంచి ఇప్పటివరకు రూ.2,65,320 పెన్షన్ పేరిట ప్రభుత్వ ఖజానాను దోచుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 883 మంది గీత కార్మికులు పెన్షన్ తీసుకుంటుండగా, ఇందులో ఎంతమది అనర్హులున్నారో విచారణ చేపడితే వెలుగులోకి వస్తుంది. ఈ విషయమై జిల్లా ఎకై ్సజ్ అధికారిని వివరణ కోరేందుకు ప్రయత్నించగా స్పందించకపోడం గమనార్హం.