
● చిన్నారులు ఆడుకునే నోట్లుగా గుర్తింపు
చిన్నారులు ఆడుకునే నోట్లుగా గుర్తింపు
మంచిర్యాలరూరల్(హాజీపూర్): గుడిపేటలో ఆదివారం నకిలీ నోట్ల కలకలం సృష్టించింది. నోట్ల మార్పిడి అంటూ దావనంలా వ్యాపించింది. స్థానికులు తెలిపిన వివరాలు.. గుడిపేట లిక్కర్ గోదాం సమీపంలో కొంతమంది కారులో రాగా, మరొకరు బైక్‌పై వచ్చారు. వీరంతా డబ్బు పంపకాలు చేసుకుంటుండగా వారిలో ఒక్కసారిగా వాగ్వాదం చోటుచేసుకుంది. స్థానికులు వారిని నిలదీయడంతో ఇరువర్గాల వ్యక్తులు కొందరు కారులో లక్సెట్టిపేట వైపు, మరికొందరు ఆటోలో మంచిర్యాల వైపు పారిపోయారు.
అయితే అక్కడ ఉండిపోయిన మరో వ్యక్తి తన వద్ద రూ.లక్ష దొంగిలించుకుని పారిపోయారని చెప్పగా స్థానికులు అనుమానంతో నిలదీశారు. తన వద్ద ఉన్న సంచిని అక్కడ వదిలి పారిపోయాడు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో ఘటన స్థలానికి చేరుకుని విచారించారు. సంచి పట్టుకుని వెళ్లిన స్థానికుడి వద్దకు వెళ్లి పరిశీలించగా రూ.500గా ఉన్న ఓ పది కట్టలు చిన్న పిల్లలు ఆడుకునే చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోట్లుగా గుర్తించారు. మంచిర్యాల రూరల్ సీఐ ఆకుల అశోక్, హాజీపూర్ ఎస్సై స్వరూప్‌రాజ్‌లు ఈ ఘటనపై మరింత లోతుగా విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. జాతీయ రహదారిపై ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నట్లు తెలిసింది.