
ఆటోడ్రైవర్ అనుమానాస్పద మృతి
నస్పూర్: సీసీసీ నస్పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ ఆటో డ్రైవర్ అనుమానాస్పదంగా మృతిచెందాడు. స్థానిక ఎస్సై ఉపేందర్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. నస్పూర్ షిర్కే కాలనీకి చెందిన పూదరి సతీష్(40) ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. భార్య నుంచి విడాకులు కావడంతో ఒంటరిగా ఉంటున్నాడు. సతీష్ ఇంటి పొరుగు వారైన పన్యాల బంగారితో పార్కింగ్ విషయంలో గత నాలుగు నెలల క్రితం వివాదాలు తలెత్తాయి. ఈ నెల 28న సాయంత్రం మరోసారి పార్కింగ్ విషయంలో గొడవ జరిగింది. బంగారి భార్య లక్ష్మి, చిన్న కూతురు సతీష్ ఇంట్లోకి చొరబడి అతడిని కొట్టారు. అదే సమయంలో గుర్తు తెలియని వ్యక్తి వచ్చి సతీష్‌ను సుత్తితో కడుపులో కొట్టాడు. సోమవారం సతీష్ అక్క పోగుల స్వప్న ఇంటికి వెళ్లి చూసే సరికి గాయాలతో అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి మృతిచెందినట్లు ధ్రువీకరించారు. మృతుడి అక్క పోగుల స్వప్న ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.