
కార్మికులను శ్రమదోపిడీకి గురిచేస్తున్న ప్రభుత్వం
బెల్లంపల్లి: ఎన్నికల హామీలు నెరవేర్చకుండా రాష్ట్రప్రభుత్వం కార్మికులను శ్రమదోపిడీకి గురిచేస్తోందని తెలంగాణ మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సావనపల్లి వెంకటస్వామి విమర్శించారు. పట్టణంలోని ఎస్సీ కమ్యూనిటీ హాల్‌లో ఆదివారం సంఘం జిల్లా 3వ మహాసభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. మృతి చెందిన కార్మికుల స్థానంలో కుటుంబ సభ్యులకు ఉద్యోగావకాశం కల్పించాలని జీవో ఉన్న మున్సిపల్ కమిషనర్లు అమలు చేయడం లేదన్నారు. ఈఎస్‌ఐ డబ్బులు జమచేయడం లేదన్నారు. ఈ కారణంగా ప్రమాదం బారినపడిన కార్మికులకు వైద్యసేవలు అందకుండా పోతున్నాయన్నారు. మున్సిపల్ కార్మికులకు ఒకపూట పని విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఆందోళనలు ఉధృతం చేస్తామని ప్రకటించారు. అనంతరం 15 మందితో జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి సంకె రవి, సీఐటీయూ మండల కన్వీనర్ సీహెచ్.దేవదాస్, నాయకులు రవి, శ్రీనివాస్, ప్రభాకర్, రాజేష్, లక్ష్మీనారాయణ, కమల్, శివ, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.