
బతుకమ్మ వేడుకలకు ఆర్‌కేపీ ముస్తాబు
రామకృష్ణాపూర్: బతుకమ్మ వేడుకలకు పట్టణంలోని సింగరేణి ఠాగూర్ స్టేడియం, సీహెచ్‌పీలు ముస్తాబయ్యాయి. సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో అధికారులు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. సుమారు 10వేల మందికి పైగా మహిళలు పాల్గొనే అవకాశం ఉండటంతో బతుకమ్మ ఆటలు ఆడేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేశారు. ఆర్‌కేపీ సీహెచ్‌పీతోపాటు ఠాగూర్ స్టేడియంలో బతుకమ్మలను నిమజ్జనం చేసేందుకు వీలుగా తాత్కాలిక మడుగులను ఏర్పాటు చేశారు. ఆదివారం సింగరేణి అధికారులు, ఆయా రాజకీయ పార్టీల నాయకులు ఈ ఏర్పాట్లను పరిశీలించారు. సోమవారం సాయంత్రం 6 గంటలకు వేడుకలు ప్రారంభం కానుండగా ఉత్తమ బతుకమ్మలకు బహుమతులు అందజేయనున్నారు.