
బాసరలో శరన్నవరాత్రి ఉత్సవాలు
బాసర: బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయంలో సోమవారం శ్రీ శారదీయ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు అమ్మవారు శైలపుత్రి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు అమ్మవారికి నైవేద్యంగా కట్టెపొంగలిని సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు అమ్మవారికి మహా రుద్రాభిషేకం, మహా కుంభాభిషేకం, తదితర ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి అంజనీదేవి ఉత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అమ్మవారిని దర్శించుకునేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుంచి భక్తులు తరలివచ్చారు. గోదావరినదిలో పుణ్యస్నానం ఆచరించి అమ్మవారి దర్శనానికి క్యూలో బారులు తీరారు. తల్లిదండ్రులు తమ చిన్నారులకు అక్షరాభ్యాసం, కుంకుమార్చన పూజలు చేయించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముధోల్ సీఐ మల్లేశ్, బాసర ఎస్సై శ్రీనివాస్ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అమ్మవారికి ఉచిత అన్నదాన ప్రసాదాన్ని గడిపుర బాబా జగదీష్ మహారాజ్, దేవస్థానం సమన్వయంతో వితరణ చేశారు.