
వరద నీటిలోపడి ఒకరు మృతి
తానూరు: మండలంలో ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి మద్యం మత్తులో వరదనీటిలో పడి ఒకరు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. ఎస్సై షేక్ జుబేర్ తెలిపిన వివరాల మేరకు మండలంలోని ఉమ్రి(కే) గ్రామానికి చెందిన చిలింకర్ మాధవ్ (35) ప్రైవేట్ ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. పనికోసం వెళ్లిన ఆయన రాత్రి 8 గంటల ప్రాంతంలో ఉమ్రి(కే) బస్టాప్ వద్ద దిగి సమీపంలో ఉన్న కల్వర్టుపై కూర్చునే క్రమంలో అందులో పడి మృతి చెందాడు. సోమవారం ఉదయం మృతదేహాన్ని గమనించిన స్థానికులు బాధిత కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుని భార్య సునీత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.