
మారిన రోడ్డు విస్తరణ ప్రణాళిక?
బెల్లంపల్లి: బెల్లంపల్లి మున్సిపాలిటీలో ఓ ముఖ్యమైన అంతర్గత రోడ్డు వెడల్పు ప్లానింగ్ మారబోతోందా?ముఖ్యమైన మూడు ప్రాంతాల్లో రోడ్ల విస్తరణ చేపట్టనున్నారు. వీటిలో రెండు ప్రాంతాల రోడ్లు యధాతథంగా వెడల్పు చేయనుండగా ఓరోడ్డును మాత్రం కుదించబోతున్నారా, ఇందుకు కొందరి అండదండలతో ప్లానింగ్ రిపోర్టు మార్చడానికి కుయుక్తులు పన్నుతున్నారా?.. వీటన్నింటికీ సమాధానం పురప్రజల నుంచి అవుననే వస్తోంది. ఈ విషయంలో ఇప్పటికే కొందరు రంగంలోకి దిగి పావులు కదిపి లైన్‌క్లియర్ చేసినట్లు ప్రచారం జరుగుతుండగా అందుకు తగినట్లుగా అధికారులు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.
తొలుత ప్రతిపాదించింది ఇలా...
మున్సిపాలిటీలో పెరుగుతున్న జనాభా, అవసరాల రీత్యా రోడ్ల విస్తరణ చేపట్టాలని కొన్నాళ్ల క్రితం తీర్మానించారు. రూ.8.94 కోట్ల అంచనాతో కాల్‌టెక్స్ రైల్వే ప్లైఓవర్ బ్రిడ్జి వద్ద నుంచి ఏఎంసీ మీదుగా అంబేడ్కర్ (కాంటా) చౌరస్తా వరకు 100 ఫీట్లతో, పాత బస్టాండ్ నుంచి శ్రీసరస్వతీ శిశుమందిర్ మీదుగా అంబేడ్కర్ నగర్ చౌరస్తా వరకు , అంబేడ్కర్ చౌరస్తా నుంచి బెల్లంపల్లి బస్తీ మీదుగా పోచమ్మగడ్డ చౌరస్తా వరకు 60 ఫీట్ల చొప్పున రోడ్లను వెడల్పు చేయనున్నట్లు ప్రతిపాదించారు. అయితే వీటిలో బెల్లంపల్లి బస్తీ నుంచి పోచమ్మగడ్డ చౌరస్తాకు వెళ్లే రోడ్డు మాత్రం 40 ఫీట్లతో నిర్మాణం చేయాలని తాజాగా సంకల్పించినట్లు ప్రచారం జరుగుతుండగా మిగతా రెండు ప్రాంతాల రోడ్లను తొలుత ప్రతిపాదించినట్లుగానే విస్తరించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
కుదించాల్సిన అవసరం ఎందుకో?
కాల్‌టెక్స్–అంబేడ్కర్ చౌరస్తా అంతర్గత ప్రధాన రహదారితో పాటు అంబేడ్కర్ చౌరస్తా నుంచి బెల్లంపల్లి బస్తీ మీదుగా పోచమ్మ గడ్డ చౌరస్తా వెళ్లే రోడ్లు ఎప్పుడు చూసినా రద్దీగా ఉంటాయి. వీటితో పోలిస్తే పాత బస్టాండ్–అంబేడ్కర్ నగర్ చౌరస్తా రోడ్డు కాస్తా తక్కువ రద్దీతో కనిపిస్తుంది. పురప్రజలకు ముఖ్యంగా వాహనాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా భవిష్యత్ అవసరాల కు అనుగుణంగా ఆ మూడు రోడ్లను విస్తరించాలని నిర్ణయం తీసుకున్నారు. రోడ్డు వెడల్పు కోసం ప్రతిపాదిత ప్రాంతాల్లో మార్కింగ్ చేశారు. తాజా గా బెల్లంపల్లి బస్తీ మీదుగా పోచమ్మ గడ్డ చౌరస్తాకు వెళ్లే రోడ్డును 20 ఫీట్లు తగ్గించి 40 ఫీట్లతో వెడల్పు చేయనున్నారనే ప్రచారం జరుగుతుండడం పురప్రజలను తీవ్ర విస్మయానికి గురిచేస్తోంది.
హైదరాబాద్‌లో పావులు కదిపారా?
బెల్లంపల్లి గ్రామీణ ప్రాంతాలతో పాటు నెన్నెల, భీమిని, కన్నెపల్లి, వేమనపల్లి, దహేగాం, తదితర ప్రాంతాల ప్రజలు బెల్లంపల్లి బస్తీ రోడ్డు మీదుగా నిత్యం రాకపోకలు చేస్తుంటారు. అంతటి ప్రాధాన్యత కలిగిన రోడ్డును ఇటీవల కొందరు హైదరాబాద్ వెళ్లి కొందరితో సంప్రదింపులు జరిపిన తర్వాతే తగ్గించాలనే ప్రతిపాదనను తెరమీదకు తీసుకువచ్చినట్లు చర్చించుకుంటున్నారు.
హైకోర్టుకు బాధితులు
రోడ్ల వెడల్పుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ బాధితులు హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. పరిహారం చెల్లించలేదని ఒకరు, నిబంధనలు పాటించడంలేదని పలువురు కోర్టుకు వెళ్లడంతో రోడ్ల విస్తరణకు ప్రతిబంధకాలు ఏర్పడుతున్నాయి.