
గణనాథుడికి ఘనంగా వీడ్కోలు
మంచిర్యాలఅర్బన్: మంచిర్యాల నగరంలో నవరాత్రులు పూజలందుకున్న గణనాథుడికి భక్తులు శనివారం రాత్రి ఘనంగా వీడ్కోలు పలికారు. భక్తితో కొలిచిన వినాయక ప్రతిమలను వాహనాలపై అలంకరించి డప్పుచప్పుళ్లు, మహిళల కోలాటాలు, యువతీ, యువకుల నృత్యాల మధ్య గంగమ్మ ఒడికి చేర్చారు. మండపాల నిర్వాహకులు ప్రత్యేక పూజలు నిర్వహించి నగర వీధుల గుండా ఊరేగింపు చేపట్టారు. సాయంత్రం ప్రారంభమైన శోభాయాత్ర కన్నుల పండువగా సాగింది. ప్రత్యేక వాహనాలపై గణనాథులు తరలుతుండగా మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. కోలాట ప్రదర్శనలు, యువత నృత్యాలు ఆకట్టుకున్నాయి. మూడు అడుగులు ఉన్న విగ్రహాలను మంచిర్యాల గోదావరి నదికి తరలించి నిమజ్జనం చేశారు. ఐదు అడుగుల పైన ఉన్న ప్రతిమలను ఇందారం, రాయపట్నం గోదావరి నదిలో క్రేన్ల సహాయంతో నిమజ్జనం చేశారు. మంచిర్యాల విశ్వనాథ ఆలయ కాలక్షేప మండపంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథునికి ప్రత్యేక పూజలు చేశారు. ముఖరాం చౌరస్తాలో హిందు ఉత్సవ సమితి ఏర్పాటు చేసిన వేదిక వద్ద సరస్వతి శిశుమందిర్ గణేష్ రథానికి జెండా ఊపి శోభాయాత్ర ప్రారంభించారు. శిశుమందిర్ విద్యార్థుల కోలాట ప్రదర్శనలు ఎంతోగానో ఆకట్టుకున్నాయి. నగరంలోని పలు కాలనీల నుంచి వినాయకులు ఒక్కొక్కటిగా హిందు ఉత్సవ సమితి వేదిక వద్దకు చేరాయి. ముస్తాబు చేసిన వాహనాలపై ఊరేగింపుగా తరలించడంతో పురవీధులన్నీ భక్తులతో జనసందోహంగా మారా యి. హిందు ఉత్సవ సమితి అధ్యక్షుడు రాజ్‌కిరణ్, ప్రధాన కార్యదర్శి రవీందర్, బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు రఘునాథ్, సభ్యులు పాల్గొన్నారు.
గోదావరి బ్రిడ్జి వద్ద..
జైపూర్: మంచిర్యాల–పెద్దపల్లి జిల్లాల సరిహద్దు గోదావరి బ్రిడ్జిపై రెండో రోజు శనివారం గణపతి నిమజ్జనం వైభవంగా నిర్వహించారు. జిల్లాలోని ఆయా ప్రాంతాల వినాయకులను ఊరేగింపుగా తీసుకొచ్చి ఇందారం గోదావరి బ్రిడ్జిపై నుంచి నిమజ్జనం చేశారు. మంచిర్యాల డీసీపీ భాస్కర్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్ ఆధ్వర్యంలో శ్రీరాంపూర్ సీఐ వేణుచందర్, ఎస్సై శ్రీధర్, పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ప్రధానంగా మంచిర్యాల నగరం నుంచి ఇందారం గోదావరికి నిమజ్జనం కోసం తరలించగా అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా సందడి నెలకొంది. నిమజ్జనం ఏర్పాట్లు, బందోబస్తును జిల్లా కలెక్టర్ కుమార్‌దీపక్, డీసీపీ భాస్కర్ పరిశీలించారు. అరగంటపాటు అక్కడే ఉండి పర్యవేక్షించారు.
రూ.1,11,116
పలికిన గణేష్ లడ్డు
మంచిర్యాలఅర్బన్: నగరంలోని రెడ్డి కాలనీ శ్రీరామ్ గణేష్ మండలిలో లడ్డు వేలంలో రూ.1,11,116 ధర పలికింది. కొత్త జయప్రకాశ్ వేలంలో దక్కించుకున్నారు. గణపతి వస్త్రాలు, హుండీ, అమ్మవారి చీర వేలం పా టలో పాల్గొని భక్తులు దక్కించుకున్నారు. ఎల్‌ఐసీ కాలనీలో బొజ్జ గణపతి వద్ద పూజలందుకున్న రూ.100 సిల్వర్ కాయిన్‌ను వేలం పాట ద్వారా పాదం పామ్స్ సంస్థ రూ.1,12,116కు దక్కించుకుంది. రూ.20 కాయిన్‌ను రూ.63,116లకు సాయి రేవంత్, రూ.10 దండను రూ.20,116 గుడిశెట్టి వెంకటయ్య వేలం పాటలో కై వసం చేసుకున్నారు.
నిబంధనలు పాటించాలి
మంచిర్యాలక్రైం: గణనాథుల శోభాయాత్రలో పోలీస్ అధికారుల నిబంధనలు పాటించాలని మంచిర్యాల డీసీపీ భాస్కర్ సూచించారు. శనివారం స్థానిక ముఖరాం చౌరస్తాలో హిందు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి వేదికపై ఆయన మాట్లాడారు. ఇబ్బందులు ఎదురైన వెంటనే స్థానికంగా ఉన్న పోలీస్ సిబ్బందికి సమాచారం అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ ప్రకాష్, సీఐ ప్రమోద్‌రావు, హిందు ఉత్సవ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ రాజ్‌కిరణ్, సభ్యులు పాల్గొన్నారు.
మంచిర్యాలలో శోభాయాత్రకు తరలివచ్చిన జనసందోహం