ప్రత్యేక రైలు వేస్తారా..! | - | Sakshi
Sakshi News home page

ప్రత్యేక రైలు వేస్తారా..!

Sep 7 2025 6:49 PM | Updated on Sep 7 2025 6:49 PM

ప్రత్యేక రైలు వేస్తారా..!

ప్రత్యేక రైలు వేస్తారా..!

బతుకమ్మ, దసరా పండుగలకు రద్దీగా రైళ్లు

కిక్కిరిసిన బోగీల్లోనే అవస్థలతో ప్రయాణం

కాగజ్‌నగర్‌–సికింద్రాబాద్‌కు మరో రైలుకు డిమాండ్లు

స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలు దృష్టి సారించాలని వినతులు

గత ఏడాది సంక్రాంతి పండుగ వేళ సికింద్రాబాద్‌ నుంచి మంచిర్యాలకు వచ్చిన ఇంటర్‌సిటీ రైలులో కనిపించిన దృశ్యమిది. ప్రయాణికులు కిక్కిరిసిపోయి ఉండడంతో కాలు తీసి కాలు పెట్టే అవకాశం లేకపోయింది. దీంతో చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు గంటల తరబడి నిల్చుని తమ గమ్యస్థానాలకు చేరుకున్నారు. ప్రస్తుతం బతుకమ్మ, దసరా సెలవుల్లోనూ పండుగ రద్దీ అధికంగా ఉంటుంది. ఈ క్రమంలో సికింద్రాబాద్‌–సిర్పూర్‌కాగజ్‌నగర్‌ మధ్య ప్రత్యేక రైలు నడపాలని ప్రయాణికులు డిమాండ్‌ చేస్తున్నారు.

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఉత్తర తెలంగాణ ప్రాంత రైలు మార్గాల్లో పండుగలు, పర్వదినాల్లో రెట్టింపు ప్రయాణికులతో రైళ్లన్నీ కిక్కిరిసిపోతున్నాయి. తెలంగాణలో అతిపెద్ద పండుగ బతుకమ్మ, దసరాకు వేలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. విద్యాసంస్థలకు సెలవులతో విద్యార్థులు, తల్లిదండ్రులు గ్రామాలు, పట్టణాలకు వెళ్తుంటారు. రద్దీ పెరిగి సికింద్రాబాద్‌, సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ వరకు ఈ ప్రాంత ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు.

ఆంధ్రా వైపేనా..

ప్రత్యేక రైళ్లు వేస్తున్నప్పటికీ ఆంధ్రాలోని కాకినాడ, నరసాపురం, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నగరాలకు రాకపోకలు సాగిస్తున్నాయి. సంక్రాంతితోపాటు ఇతర పండుగ సమయాల్లో ఆంధ్రా వైపు స్పెషల్‌ ట్రైన్లు నడుస్తున్నాయి. ఉత్తర తెలంగాణ ప్రయాణికులకు కొత్త రైలు ఊసే లేకుండా పోతోంది. మరోవైపు బస్సుల్లో పండుగ స్పెషల్‌ పేరిట అదనపు చార్జీలు వసూలు చేస్తుంటారు. మహిళలకు ఎక్స్‌ప్రెస్‌, ఆర్డినరీ ఉచిత ప్రయాణంతో బస్సులు కిక్కిరిసి ఉంటున్నాయి. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించే సికింద్రాబాద్‌ నుంచి సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ వరకు ప్రతీ రోజు ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌ నడపాల్సి ఉంది.

రద్దీగా సికింద్రాబాద్‌ రైళ్లు

ప్రస్తుతం హైదరాబాద్‌కు ఉదయం వెళ్తున్న భాగ్యనగర్‌, మధ్యాహ్నం బీదర్‌ ఇంటర్‌సిటీ, కాగజ్‌నగర్‌ సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లు ఉన్నాయి. ఇక సికింద్రాబాద్‌ నుంచి ఉదయం 9:25గంటలకు దానాపూర్‌ సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ తర్వాత భాగ్యనగర్‌ ఎక్స్‌ప్రెస్‌ వరకు మధ్యలో కాగజ్‌నగర్‌ వైపు వెళ్లడానికి ఒక్క రైలు కూడా అందుబాటులో లేదు. ఈ నెల 21నుంచి విద్యాసంస్థలకు సెలవులతో వేలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు.

స్పెషల్‌ ట్రైన్‌ నడపాలి

పండగ సమయాల్లో రైళ్లలో విపరీత రద్దీ ఉంటోంది. మంచిర్యాల, సికింద్రాబాద్‌ మధ్య సెలవుల్లో ప్రయాణాలు అధికంగా ఉంటాయి. దీంతో రైళ్లలో వెళ్లాలంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తోంది. పండగ పూట ప్రజాప్రతినిధులు, అధికారులు దృష్టి సారించి ప్రత్యేక రైళ్లు నడపాలి.

– పౌడల సుమన్‌,

రైలు ప్రయాణికుడు, మందమర్రి

కొత్త రైలు నడిపితే మేలు

మూడో లైను అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ప్రతీరోజు ఉదయం సికింద్రాబాద్‌ జంక్షన్‌ నుంచి 10.35గంటలకు బయలుదేరి, కాజిపేటకు 12.40వరకు జమ్మికుంట, పెద్దపల్లి జంక్షన్ల మీదుగా రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్‌కాగజ్‌నగర్‌ 3.45వరకు చేరుకునేలా ఓ రైలు నడపాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు. సాయంత్రం 5గంటలకు సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ నుంచి బయలుదేరి బెల్లంపల్లి, మంచిర్యాల, రామగుండం, పెద్దపల్లి జంక్షన్‌, జమ్మికుంట, కాజిపేట మీదుగా సికింద్రాబాద్‌ వరకు రాత్రి 10గంటలకు చేరుకోవాలి. ఈ రైలుకు పలు రైల్వేస్టేషన్లలో హాల్టింగ్‌ కల్పిస్తే వేలాది గ్రామాల ప్రజలకు ఉపయోగపడనుంది. మొదట ప్రయోగాత్మకంగా రైలును ఆరంభించి, రద్దీని బట్టి రెగ్యులర్‌గా రైలు నడిపితే వేలాది మందికి ఉపయోగపడనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement