పింఛన్ల పెంపునకు మరో ఉద్యమం | - | Sakshi
Sakshi News home page

పింఛన్ల పెంపునకు మరో ఉద్యమం

Sep 7 2025 6:49 PM | Updated on Sep 7 2025 6:49 PM

పింఛన్ల పెంపునకు మరో ఉద్యమం

పింఛన్ల పెంపునకు మరో ఉద్యమం

● పెంచకుంటే కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని గద్దె దించుతాం ● ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ

తాండూర్‌/జైపూర్‌/శ్రీరాంపూర్‌: నిస్సహాయక స్థితిలో పింఛన్లు పొందుతున్న పింఛన్‌దారులంటే ప్రభుత్వాలకు ఎప్పుడూ చిన్నచూపేనని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ విమర్శించారు. పింఛన్ల పెంపు, కొత్త పింఛన్ల సాధనకు మరో ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. తాండూర్‌, మండల కేంద్రంలోని సుమంగళి ఫంక్షన్‌హాల్‌, జైపూర్‌ మండలం దుబ్బపల్లి పీఎల్‌ఎన్‌ఆర్‌ గార్డెన్‌లో, సీసీసీలోని ఎంఎం గార్డెన్‌లో శనివారం నిర్వహించిన మహాగర్జన సన్నాహక సదస్సులో ఆయన మాట్లాడారు. దశాబ్దాలుగా ఎమ్మార్పీఎస్‌ చేసిన పోరాటాల ఫలితంగానే పింఛన్ల పెంపు సాధ్యమైందని తెలిపారు. వృద్ధులు, వితంతువులకు రూ.4వేలు, దివ్యాంగులకు రూ.6వేలు పింఛన్‌ ఇస్తామని అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం 20నెలలు గడిచినా ఆ ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్‌ఎస్‌ చోద్యం చూస్తోందని అన్నారు. ఈ నెల 8న కలెక్టరేట్‌ల ముట్టడి, 12న తహశీల్దార్‌ కార్యాలయాల ఎదుట ధర్నా, 20న విజయవాడ–హైదరాబాద్‌ జాతీయ రహదారి దిగ్బంధంతోపాటు అన్ని గ్రామ పంచాయతీల్లో నిరాహార దీక్షలు చేపట్టాలని పిలుపునిచ్చారు. పోరాటాలతోనే పింఛన్‌ పెంపు సాధ్యమవుతుందని అన్నారు. పింఛన్ల పెంపు, కొత్త పింఛన్లు ఇవ్వని పక్షంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని హెచ్చరించారు. ఈ సమావేశాల్లో ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర నాయకులు చుంచు శంకర్‌వర్మ, గద్దల బానయ్య, మంతెన మల్లేష్‌, నక్క అంజయ్య, జిల్లా అధ్యక్షుడు చెన్నూరి సమ్మయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి సుందిళ్ల మల్లేశ్‌, జిల్లా ఉపాధ్యక్షుడు జలంపల్లి శ్రీనివాస్‌, నాయకులు జీలకర శంకర్‌, ఆయిళ్ల గణేష్‌, స్వామి, ఏముర్ల నారాయణ, రాజేష్‌, ఇరిగిరాల మల్లేశ్‌, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు పాల్గొన్నారు. కాగా, సీసీసీలో సీనియర్‌ నేత చుంచు శంకర్‌వర్మ తల్లి ఇటీవల మృతిచెందడంతో కుటుంబ సభ్యులను మంద కృష్ణమాదిగ పరామర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement