
‘పరిషత్’లో ఓటరు జాబితా ప్రదర్శన
మంచిర్యాలరూరల్(హాజీపూర్): మండల, జిల్లా పరిషత్ ఎన్నికల నిర్వహణలో భాగంగా శనివారం మండల, జిల్లా పరిషత్ కార్యాలయాల్లో ముసాయిదా ఓటరు జాబితా ప్రదర్శించారు. ఇటీవల గ్రామ పంచాయతీల వారీగా తుది ఫొటో ఓటర్ల జాబితా ప్రదర్శన ప్రక్రియ ముగించారు. తాజాగా పరిషత్ ఓటర్ల జాబితా షెడ్యూల్ విడుదల చేశారు. ఈ నెల 6నుంచి 8వరకు జాబితాపై అభ్యంతరాల స్వీకరణ, 8న జిల్లా, మండల స్థాయిలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు, 9న అభ్యంతరాల పరిష్కారం, 10న అన్ని పోలింగ్ కేంద్రాల్లో తుది ఫొటో ఓటరు జాబితా ప్రదర్శించాలని ఎన్నికల సంఘం ప్రకటించింది. జెడ్పీ కార్యాలయంలో సీఈవో గణపతి ఆధ్వర్యంలో ముసాయిదా ఓటరు జాబితా ప్రదర్శించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు ఖరారు చేస్తూ ఇప్పటికే అధికారికంగా ప్రకటించినట్లు తెలిపారు.
జిల్లా వివరాలు
జిల్లాలో 16 జెడ్పీటీసీ స్థానాలు, 129 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. 713 పోలింగ్ కేంద్రాలు ఏర్పా టు చేశారు. ఓటర్లు 3,76,676 మంది ఉండగా.. వీరిలో మహిళలు 1,91,015మంది, పురుషులు 1,85,646, ఇతరులు 15మంది ఉన్నారు.