
● ఇందిరమ్మ ఇళ్లలో కొందరి తీరిదీ ● వివరాలు అప్‌లోడ్ చేయ
ఇందిరమ్మ ఇళ్ల వివరాలు
నిర్మాణంలో ఉన్నవి 6,624
ప్రస్తుతం పెండింగ్ బిల్లులు 110
సాంకేతిక కారణాలతో నిలిచినవి 35
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం బిల్లుల మంజూరులో అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. కొన్ని చోట్ల లబ్ధిదారులను డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా హాజీపూర్ మండలం కర్ణమామిడి పంచాయతీ కార్యదర్శి బిల్లు మంజూరుకు లబ్ధిదారు నుంచి డబ్బులు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. పునాది, గోడలు, స్లాబ్, ప్లాస్టరింగ్, ఇల్లు పూర్తయ్యే వరకు దఫాల వారీగా మొత్తం రూ.5లక్షలు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తుంటారు. ఎంపికై న లబ్ధిదారు ఇంటి నిర్మాణం కోసం ముగ్గు పోయడం మొదలు ఆయా దశల్లో ఫొటోలు, వివరాలు అధికార పోర్టల్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో కొందరు లబ్ధిదారుల వివరాలు సరిగా లేకపోవడం, కొలతలు హెచ్చుతగ్గులు, ఫొటోలు అప్‌లోడ్ చేసేందుకు జాప్యం చేస్తూ అధికారులు చేతివాటం చూపిస్తున్నారు. ఇక కొందరు తమకు బిల్లులు తొందరగా రావాలనే ఉద్దేశ్యంతోనూ అధికారులకు ఎంతో కొంత ఆశ చూపడం కూడా జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.
పరిశీలన జరిగాకే నగదు జమ
ఇంటి నిర్మాణాన్ని పరిశీలన చేసి ఫొటోలు, వివరాలు సరిచూసుకున్నాకే డబ్బులు విడుదలవుతున్నాయి. ఇందుకోసం మొదట పంచాయతీ కార్యదర్శి ముగ్గు పోయడం మొదలు, పునాదులు, గోడలు, స్లాబ్, ఇంటి నిర్మాణం పూర్తయ్యే వరకు జియో ట్యాగింగ్‌తో కూడిన నిర్మాణ కొలతలు, లబ్ధిదారుల వివరాలు నమోదు చేస్తారు. నమోదు చేసిన వివరాల ఆధారంగానే హౌసింగ్ కార్పొరేషన్ ఏఈఈ, తర్వాత డీఈఈ, పీడీ, ఆ తర్వాత ఈఈ, ఎస్‌ఈ, సీఈ, ఆపైన ఉన్నతాధికారుల దాకా పరిశీలనలు జరుగుతాయి. మొదట క్షేత్రస్థాయిలో పంచాయతీ కార్యదర్శులు నమోదు చేసిన వివరాలు, ఆ తర్వాత పరిశీలించే ఏఈఈలు బిల్లుల మంజూరులో కీలకంగా మారారు. దీంతో లబ్ధిదారుల బిల్లుల చెల్లింపులో కొన్ని చోట్ల అధికారులు డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మొదట ప్రభుత్వ బ్యాంకు ఖాతాల ఆధారంగా డబ్బులు చెల్లింపులు జరిగాయి. ప్రభుత్వం మరింత పారదర్శకంగా పంపిణీ చేయాలనే ఉద్దేశ్యంతో ప్రస్తుతం ఆధార్‌కార్డు అనుసంధానంతో జమ చేస్తోంది. కొంతమందికి ఆధార్ లింకు లేకపోవడం, కొందరి ఖాతాలు పోస్టాఫీసుల్లో ఉండడం, జీరో అకౌంట్ బ్యాలెన్స్ ఉన్నవి, మనుగడ లేని అకౌంట్లు తదితర కారణాలతో నిలిచిపోయాయి. జిల్లాలో 6వేలకు పైగా ఇళ్ల నిర్మాణాలు మొదలు కాగా, వీటిలో సుమారు రూ.16కోట్ల పైగా చెల్లింపులు జరిగాయి. కొన్ని బిల్లుల చెల్లింపులకు పలు కారణాలతో జాప్యం జరుగుతున్నాయి. ఇటీవల కొందరు తమకు బిల్లులు రావడం లేదని కలెక్టర్‌కు కూడా విన్నవించారు.

● ఇందిరమ్మ ఇళ్లలో కొందరి తీరిదీ ● వివరాలు అప్‌లోడ్ చేయ