నకిలీ చెలా‘మనీ’!
● జిల్లాలో యథేచ్ఛగా మార్కెట్లలోకి..
● వినియోగదారులు లక్ష్యంగా మార్పిడి.. ● జిల్లా కేంద్రంలో ఓ వారం రోజుల క్రితం ఇంద్రనగర్‌కు చెందిన ఓ మహిళ కుటుంబ అవసర నిమిత్తం స్థానిక జువెల్లరీ దుకాణంలో రెండు తులాల బంగారు చైను తాకట్టు పెట్టి రూ.లక్ష తీసుకుంది. ఇంటికి వెళ్లిన రెండ్రోజుల తర్వాత వాటిని వేరే వ్యక్తికి ఇచ్చేందుకు సదరు మహిళ భర్త లెక్కించే క్రమంలో అనుమానం వచ్చి పరిశీలించగా రూ.500 నోట్ల కట్టలో మధ్యలో ఐదు నోట్లు నకిలీవిగా గుర్తించాడు. వెళ్లి బంగారం దుకాణం వ్యాపారిని ప్రశ్నించగా.. తనకు సంబంధం లేదని చెప్పడంతో ఏం చేయలేక మిన్నకుండిపోయారు.
● 2021 జనవరి 9న మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి స్థానిక మార్కెట్‌లో కూరగాయలు విక్రయించే మహిళకు రూ.500 నోటు ఇచ్చి రూ.40 విలువైన కూరగాయలు కొనుగోలు చేశాడు. ఆమె మిగతా డబ్బు ఇవ్వగా త్వరగా వెళ్తుండడంతో అనుమానం వచ్చి పక్కనున్న వ్యాపారికి నోటు చూపించింది. నకిలీదనే అనుమానంతో వ్యాపారులు అడ్డుకోగా పారిపోయే ప్రయత్నం చేశాడు. మరో నోటు ఇవ్వాలని అడగడంతో తీసిచ్చాడు. రెండింటిపై ఒకే నంబరు ఉండడంతో అతడిని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనలో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ నోట్ల ప్రింటింగ్‌కు ఉపయోగించిన కలర్ జిరాక్స్ మిషన్, కత్తెర, ప్రింట్ చేసి ఉన్న రూ.500, రూ.200 నోట్లు రూ.56వేల విలువైన కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు.
మంచిర్యాలక్రైం: జిల్లాలో నకిలీ కరెన్సీ చెలామణి మళ్లీ తెరపైకి వచ్చింది. ఏడాదికోసారి ఎక్కడో ఓ చోట వెలుగు చూస్తూనే ఉంది. చిరు వ్యాపారులు, కూరగాయల వ్యాపారులు, రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని రూ.500, రూ.200 నకిలీ కరెన్సీ చెలామణి చేస్తున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే అత్యాశతో కొందరు మార్పిడి చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. చాపకింద నీరులా సాగుతున్న ఈ వ్యవహారంలో అమాయకులు నష్టపోతున్నారు. జిల్లాలో కొందరు బడా వ్యాపారులు సైతం దందాకు తెరతీశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత నెల 29న జిల్లా కేంద్రంలోని ఓ పెట్రోల్ బంక్‌లో నాయికిని పోశం అనే వ్యక్తి తన ద్విచక్ర వాహనంలో రూ.1000 పెట్రోల్ పోయించుకుని నగదు అవసరం కావడంతో రూ.2వేలు ఫోన్ పే ద్వారా చెల్లించాడు. బంక్ ఉద్యోగి రూ.వెయ్యి తిరిగి ఇచ్చే క్రమంలో రూ.200 నకిలీ నోటు ఇచ్చాడు. నకిలీ నోటును గుర్తించిన పోశం యాజమాన్యంతో వాగ్వాదానికి దిగడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.