
ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి
మంచిర్యాలరూరల్(హాజీపూర్): కటిక పేదరికంతో అద్దె ఇంట్లో ఇంటూ సొంతింటి కల సాకారానికి అష్టకష్టాలు పడుతున్న లబ్ధిదారును పంచాయతీ కార్యదర్శి ఇబ్బందులకు గురి చేశాడు. ఇందిరమ్మ ఇంటి ఫొటో అప్‌లోడ్ చేయాలంటే డబ్బులు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టాడు. కాళ్లు మొక్కుతానన్న కనికరం చూపలేదు. ఎమ్మెల్యే మందలించినా అతడి తీరు మారలేదు. బాధితురాలు ఏసీబీని ఆశ్రయించగా బుధవారం వలపన్ని పట్టుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. హాజీపూర్ మండలం కర్ణమామిడి గ్రామానికి చెందిన డొల్క నాగమణికి ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ అప్పు చేసి బేస్‌మెంటు వరకు నిర్మించింది. మొదటి బిల్లు కోసం గ్రామ పంచాయతీ కార్యదర్శి అక్కల వెంకటస్వామిని సంప్రదించగా.. పలు కొర్రీలు పెడుతూ ఫొటో అప్‌లోడ్ చేయాలంటే రూ.30వేలు డిమాండ్ చేశాడు. ఉన్నతాధికారులకు వాటాలు ఇవ్వాల్సి ఉంటుందని తెలిపాడు. అంత ఇవ్వలేనని వేడుకోగా.. రూ.25వేలు ఇవ్వాలని సూచించాడు. చివరికి రూ.20వేలకు అంగీకరించగా.. మూడు రోజుల్లో ఇస్తానని చెప్పినా వినిపించుకోలేదు. దీంతో బాధితురాలు ఏసీబీ అధికారులను ఆశ్రయించింది. నాగమణి ఇంట్లో రూ.20వేలు తీసుకుంటుండగా కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ, ఆదిలాబాద్ ఇంచార్జి డీఎస్పీ పి.విజయ్‌కుమార్, సిబ్బంది రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. విచారణ అనంతరం అరెస్ట్ చేసి కరీంనగర్‌కు తరలించారు. గురువారం ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు. ఏసీబీ ఇన్‌స్పెక్టర్లు కిరణ్, తిరుపతి, కానిస్టేబుల్ పాల్గొన్నారు. కాగా, డబ్బులు ఇచ్చుకోలేనని కాళ్లపై పడినా కనికరించలేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. మరణ ధ్రువీకరణ పత్రం, రేషన్‌కార్డు, పింఛన్ తదితర వాటికి డబ్బులు తీసుకున్నాడని పలువురు గ్రామస్తులు ఏసీబీ డీఎస్పీకి ఫిర్యాదు చేశారు.
ఎమ్మెల్యే మందలించినా..
పంచాయతీ కార్యదర్శి వెంకటస్వామి ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల విషయంలో లబ్ధిదారుల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు గతంలో స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన కార్యదర్శిని తీవ్రంగా మందలించారు. అయినా అతడి తీరులో మార్పు రాలేదు. వేధింపులు ఇంకా ఎక్కువయ్యాయి.