
బాసరలో ‘శ్రావణ’ సందడి
బాసర: బాసరలో ‘శ్రావణ’ సందడి మొదలైంది. శ్రావణమాసం తొలి శుక్రవారం కావడంతో శ్రీజ్ఞాన సరస్వతీ అమ్మవారి దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాలతోపాటు పొరుగునే ఉన్న మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు అధికసంఖ్యలో వచ్చారు. ముందుగా పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలాచరించారు. అనంతరం సరస్వతీ, మహాలక్ష్మి, మహా కాళి అమ్మవార్లను దర్శించుకుని పూజలు చేశారు. ఆలయ అర్చకులు, వేదపండితులు వేకువజామున వేద మంత్రోచ్ఛారణల మధ్య అమ్మవారికి నిత్య అభిషేకం, హారతి, గణపతి పూజ, కలశపూజ, కుంకుమార్చన ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక అక్షరాభ్యాస మండపంలో తల్లిదండ్రులు చిన్నారులతో అక్షరాభ్యాసం చేయించారు. కుంకుమార్చన పూజ లు జరిపించారు. అమ్మవారి దర్శనానికి గంట స మయం పట్టినట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ అధికారులు, పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.