
రైతులకు చేయూత
● వృద్ధాప్యంలో పింఛన్ ● జిల్లాలో 1.67లక్షల మంది రైతులు
చెన్నూర్‌రూరల్: రైతుల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయి. చాలా వరకు వ్యవసాయం చేస్తున్న సమయాల్లో మాత్రమే ఉపయోగపడుతున్నాయి. వృద్ధాప్యంలో ఆదాయ మార్గాలు లేక చాలామంది రైతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వయస్సులో ఉండగానే కొంత ప్రీమియం చెల్లిస్తే ప్రతీ నెల పింఛన్ రూపంలో అందేలా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ మాన్‌ధన్ యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. 60ఏళ్లు నిండిన రైతులకు ప్రతీ నెల రూ.3వేల పింఛన్ అందించడం ఈ పథకం ముఖ్యోద్దేశం. ఎల్‌ఐసీ ద్వారా అందించే ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటే వృద్ధాప్యంలో ఆసరా లభిస్తుంది.
వయస్సును బట్టి ప్రీమియం
18నుంచి 40ఏళ్లు ఉన్న రైతులు ప్రతీ నెల రూ.55నుంచి రూ.200 వరకు వయస్సుల వారీగా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. వయస్సును బట్టి ప్రీమియం పెరుగుతుంది. ఐదెకరాల్లోపు భూమి ఉన్న రైతులు ఈ పథకానికి అర్హులు. పట్టాపాస్‌పుస్తకం కలిగి ఉండాలి. జాతీయ పింఛన్ పథకం(ఎన్‌పీఎస్), ఈఎస్‌ఐ, ఈపీఎఫ్‌తోపాటు ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయ పన్ను చెల్లించే వారు అనర్హులు. 40ఏళ్ల వయస్సు వచ్చే వరకు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. 60ఏళ్లు పైబడిన తర్వాత సంబంధిత రైతుకు నెలకు రూ.3వేలు పింఛన్ అందుతుంది. ఒకవేళ రైతు మరణిస్తే భార్యకు రూ.1500 పింఛన్ అందిస్తారు.
మీ సేవా కేంద్రంలో దరఖాస్తు
పీఎం కిసాన్ మాన్ ధన్ పింఛన్ కోసం రైతులు మీ సేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలి. రైతు, నామిని, ఆధార్ కార్డు వివరాలు నమోదు చేయాలి. పింఛన్ కార్డు వచ్చిన తర్వాత పీఎం కిసాన్ పథకానికి అనుసంధానమైన బ్యాంకు నుంచి ప్రీమియం నగదు చెల్లించాలి.
అవగాహన కల్పిస్తున్నాం
పీఎం కిసాన్ మాన్ ధన్ పథకంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. రైతులు ముందుకు వచ్చి ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రీమియం చెల్లించిన రైతులకు 60ఏళ్లు నిండాక పింఛన్ అందజేస్తారు. పూర్తి వివరాల కోసం సంబంధిత ఏఈవోలను సంప్రదించాలి.
– బానోతు ప్రసాద్, ఏడీఏ, చెన్నూర్

రైతులకు చేయూత