
ఎరువుల కొరత సృష్టిస్తే చర్యలు
● రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
మంచిర్యాలఅగ్రికల్చర్: రైతుల అవసరాల మేరకు ప్రభుత్వం ఎరువుల సరఫరా చేపడుతోందని, కృత్రిమ కొరత సృష్టిస్తే సంబంధిత వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. సోమవారం హైదరాబాద్‌లోని సచివాలయం నుంచి ముఖ్యమంత్రి, ఖమ్మం నుంచి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లు, పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ఫర్టిలైజర్ దుకాణాలను తనిఖీ చేసి నిల్వలు, నోటీసు బోర్డులపై ఉంచిన వివరాలు పరిశీలించాలని, ఎరువులు పక్కదారి పట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. భారీ, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జన జీవనానికి ఇబ్బందులు లేకుండా, రహదారులు తెగిపోకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను జిల్లాలో పకడ్బందీగా అమలు చేసే విధంగా అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రేషన్‌కార్డులు పంపిణీ చేసే ప్రాంతాలతో కార్యాచరణ రూపొందించి ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తున్నామని అన్నారు. జిల్లాలో వరద బాధితుల సహాయార్థం కంట్రోల్ రూమ్ నంబరు 08736 250501 ఏర్పాటు చేసి ప్రజలందరికీ తెలిసే విధంగా ప్రచారం చేసినట్లు తెలిపారు.