
‘ఇష్టానుసారంగా ఉపాధ్యాయుల సర్దుబాటు’
జన్నారం: ప్రభుత్వ ఉత్తర్వులను అతిక్రమించి ఇష్టానుసారంగా ఉపాధ్యాయుల సర్దుబాటు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రాజేష్‌నాయక్ అన్నారు. సోమవారం ఆయన మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. విద్యార్థుల కంటే ఉపాధ్యాయుల ప్రయోజనాలనే దృష్టిలో ఉంచుకుని సర్దుబాటు చేశారని, కొన్ని ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న కూడా ఉపాధ్యాయులను సర్దుబాటు చేయకపోవడం విస్మయానికి గురి చేస్తోందని తెలిపారు. జన్నారం మండలంలో అత్యధిక విద్యార్థులున్న రేండ్లగూడ, ఇందన్‌పెల్లి, ధర్మారం ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయని, పక్క మండలాల్లో మిగులు ఉన్నా సర్దుబాటు చేయలేదని తెలిపారు. మి గులు ఉపాధ్యాయులు పని చేస్తున్న మండలాల్లో ఖాళీ లేకుంటే పక్క మండలాలు, జిల్లాలో ఎక్కడైనా సర్దుబాటు చేయాలనే ఉత్వర్వులు ఉన్నాయని తెలిపారు. కొందరు ఉపాధ్యాయులను ఏజెట్లుగా పెట్టుకుని ఉపాధ్యాయులను భయభ్రాంతులకు గురి చేస్తున్న విద్యాశాఖ అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, ఈ విషయంలో కలెక్టర్ సమగ్ర విచారణ జరపాలని కోరారు.