
ఎస్టీ ఆశ్రమ విద్యార్థినులకు అస్వస్థత
మంచిర్యాలఅర్బన్: జిల్లా కేంద్రంలోని గిరిజన బాలికల వసతిగృహంలో ఇద్దరు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఎనిమిదో తరగతి విద్యార్థిని తరుణి జ్వరంతో, ఆరోతరగతి విద్యార్థిని రేవతి (టాన్సిలైటిస్) కుతికలతో బాధపడుతుండగా రెండు రోజుల క్రితం మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. కాగా ఫుడ్ పాయిజన్‌తో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని ప్రచారం జరుగుతోంది. దీనిపై వసతిగృహ నిర్వాహకులు సరైన సమాధానం చెప్పకపోవడంతో సోమవారం విద్యార్థినుల కుటుంబ సభ్యులు వసతిగృహ గేటు ఎదుట నిరసన తెలిపారు.
అనాలోచిత చర్యలకు పాల్పడితే కఠినచర్యలు
వసతిగృహ విద్యార్థినులు అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నామని, వారి ఆరోగ్యం నిలకడగా ఉందని కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఏటీడీవో, పాఠశాల ప్రధానోపాధ్యాయులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారన్నారు. కాగా కలుషిత ఆహారం తినడం వల్ల జరిగిందని అవాస్తవ ప్రచారం చేసి గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తే కఠినచర్యలు తీసుకుంటామన్నారు.