
పాముల కాలం.. జర భద్రం
● పశు పోషకులు జాగ్రత్తలు తీసుకోవాలి ● వైద్యాధికారి అజయ్ కుమార్
లక్ష్మణచాంద: వానాకాలంలో పాముల బెడద ఎక్కువగా ఉంటుంది. పశువులు బీడు భూములు, అడవిలోకి మేతకు వెళ్లినప్పుడు విషసర్పాలు కాటేసే ప్రమాదం ఉంది. రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మండల పశు వైద్యాధికారి అజయ్ కుమార్ సూచిస్తున్నారు.
రక్త పింజర కాటు వేస్తే...
పశువులను రక్త పింజర కాటు వేస్తే హీమోటాక్సిన్ విడుదలై రక్త ప్రసరణ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. దీంతో పశువు నోరు, ముక్కు నుంచి రక్తం కారుతుంది. కాటు వేసిన చోట వాపు వచ్చి చర్మం రంగు మారుతుంది. మూత్రం ఎరుపు రంగులో వస్తుంది. సరైన సమయంలో చికిత్స అందకపోతే పది గంటల్లోపు మృత్యువాత పడుతాయి.
త్రాచు, కట్ల పాములు
త్రాచు, కట్ల పాములు పశువులను కాటు వేసినప్పుడు న్యూరోటాక్సిన్ వాటి శరీరంలోకి వెళ్లి నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. దీంతో శ్వాస వ్యవస్థ స్తంభిస్తుంది. నోటి నుంచి నురగ వచ్చి అపస్మారక స్థితిలోకి వెళ్తాయి. సరైన సమయంలో చికిత్స అందించకపోతే పశువు మృతి చెందుతుంది.
విషరహిత పాము కాటు లక్షణాలు
రెండు వరుస పళ్ళ ముద్రలు ఉంటాయి. కానీ వాటిలో పెద్దగా నిదానమైన రెండు ముద్రలు ఉండవు (విషపాము వద్ద వాటితో టాక్సిన్ ఇంజెక్ట్ చేస్తుంది). గాయాలు చిన్నగా ఉంటాయి. ఎక్కువగా పలుచని రేఖల వంటి ముద్రలుగా ఉంటాయి. కొద్దిగా రక్తం కారవచ్చు. కానీ ఇది ప్రమాద కరమైన స్థాయిలో ఉండదు.
విషపూరిత పాముకాటు లక్షణాలు
కాటు చేసిన చోట ఉబ్బినట్టు, గాయంలా కనిపిస్తుంది. పశువు తినకుండా, నీరసంగా ఉంటుంది. అదుపు తప్పటం (పిచ్చెక్కినట్టుగా) అటు ఇటు తిరగడం, నోటిలో నురుగు రావడం, వేగంగా గుండె చప్పుళ్లు, శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది, పొట్ట ఉబ్బడం, కింద పడిపోయి కాళ్ళు కొట్టుకోవడం చేస్తాయి. కొన్ని సందర్భాల్లో 3 నుంచి 5 గంటల్లోనే మృతి చెందుతాయి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
● పాము కాటుకు గురైన పశువును బయటకు పంపవద్దు. ఎక్కువగా నడిపించవద్దు. కదలకుండా ఉంచాలి.
● కాటు వేసిన ప్రాంతానికి పైభాగంలో గట్టిగా కట్టుకట్టాలి. ఇది పాము విషం నరాల ద్వారా వ్యాపించకుండా ఉపయోగపడుతుంది. 15 నిమిషాలకోసారి నిమిషం పాటు విరమించాలి. లేదంటే నరాలు నశించే ప్రమాదం ఉంది.
● కాటు వేసిన చోట కడుగవద్దు. కట్టు తీయవద్దు. ఇలా చేస్తే విష వ్యాప్తి పెరుగుతుంది.
● పశువును నీడలో బాగా గాలి తగిలేటట్లు ఉంచాలి. తల ఎత్తిన స్థితిలో ఉండేలా చూడాలి.
● వెంటనే పశువైద్యుడిని సంప్రదించి చికిత్స అందిస్తే ప్రాణాపాయం నుంచి కాపాడవచ్చు.
సకాలంలో చికిత్స అందించాలి
పశువులను మేతకు తీసుకెళ్లినప్పుడు తరచూ గమనించాలి. పాము కాటువేస్తే కరిచిన చోట గుడ్డతో గట్టిగా కట్టుకట్టాలి. బ్లేడుతో కోసి రక్తం పిండాలి. 20 నిమిషాలకోసారి కట్టును వదులు చేస్తూ ఉండాలి. స్నేక్ ఆంటీవీనమ్ ఇంజక్షన్, ఆట్రోసిన్ సల్ఫేట్, ఏవిల్ ఇంజక్షన్ పశువు రక్తంలోకి ఎక్కించాలి. నొప్పి నివారణకు స్టీరాయిడ్స్, ఆంటి బయాటిక్స్, కార్టికోస్టియిడ్స్, అనాలెజిక్స్, గ్లూకోస్ వంటి మందులు అవసరాన్ని బట్టి ఇవ్వాలి.
– అజయ్ కుమార్,
పశు వైద్యుడు, లక్ష్మణచాంద

పాముల కాలం.. జర భద్రం