
అస్సాం రైఫిల్ జవాన్ ఆకస్మిక మృతి
బజార్‌హత్నూర్: మండలంలోని వర్తమన్నూర్ గ్రామానికి చెందిన నలువల విజయ్, సుగుణ దంపతుల కుమారుడు నలువల ఆకాశ్ (24) 2025 ఫిబ్రవరి 24న అస్సాంలోని రైఫిల్ రెజిమెంట్ క్యాంపులో జవానుగా విధుల్లో చేరాడు. సోమవారం ఉద యం 20 కిలోమీటర్లు రన్నింగ్‌లో భాగంగా పరుగులు తీస్తూ కిందపడిపోయాడు. తోటి జవాన్లు వెంట నే సైనిక ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ఆర్మీ అధికారులు విషయాన్ని ఆకాశ్ తల్లిదండ్రులకు తెలియజేయడంతో షాక్‌కు గురై కుప్పకూలారు. పార్థివదేహం మంగళవారం ఉదయం గ్రామానికి చేరుకుంటుందని ఎస్సై సంజయ్ తెలిపారు.
కుక్కను ఢీకొని ఒకరు..
వాంకిడి: ద్విచక్ర వాహనంతో కుక్కను ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై ప్రశాంత్ తెలిపిన వివరాల మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం అడ్డగుంటపల్లికి చెందిన మొగిళి బక్కయ్య(46) ఆదివారం మహారాష్ట్రలోని పాసిగాంలో ఉన్న బంధువుల ఇంటికి ద్విచక్ర వాహనంపై వెళ్లాడు. తిరుగుప్రయాణంలో వాంకిడి మండలంలోని గోయెగాం శివారులో బైక్‌కు అడ్డువచ్చిన కుక్కను ఢీకొట్టడంతో కిందపడిపోయాడు. తీవ్రగాయాలు కావడంతో గమనించిన స్థానికులు 108లో ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు మంచిర్యాలలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమంచి రాత్రి మృతి చెందాడు. సోమవారం మృతుని సోదరుడు రాజయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం.. ఉద్యోగం ఇప్పిస్తానని మోసం
తానూరు(ముధోల్): ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన వ్యక్తితో పలువురు మోసపోయిన ఘటన మండలంలోని విట్టోలి తండాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ముధోల్ ఎస్సై బిట్ల పెర్సిస్ తెలిపిన వివరాల మేరకు సూర్యాపేట జిల్లా చెరువు తండాకు చెందిన ఓ యువకుడు ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లో ముధోల్ మండలంలోని విట్టోలి గ్రామానికి చెందిన రాథోడ్ మహేందర్‌కు అమ్మాయిలాగా పరిచయమయ్యాడు. ఉద్యోగం ఉంటేనే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి అతని వద్ద రూ.20 వేలు, అతని బంధువైన ఉమేశ్ వద్ద రూ.20 వేలు తీసుకున్నాడు. వారం రోజుల క్రితం విట్టోలి గ్రామానికి వచ్చి తాను పోస్టల్ ఉద్యోగినని గ్రామస్తులను పరిచయం చేసుకున్నాడు. ఉద్యోగం ఇప్పిస్తానని పవర్ పూజ, రాథోడ్ భుమేశ్వరి, రాథోడ్ కరుణ్, పవార్ అజేష్, రాథోడ్ సంక బాయి, జాదవ్ ప్రకాష్, చౌవాన్ జగదీష్, రాథోడ్ మల్కా, జాదవ్ విశ్వనాథ్, రోహిణి వద్ద రూ.20 వేల చొప్పున వసూలు చేశాడు. ఆ తర్వాత ఫోన్‌చేస్తే స్విచ్చాఫ్ రావడంతో తాము మోసపోయామని గుర్తించిన బాధితులు సోమవారం ముధోల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.