
సర్కారు బడికే టీచర్ల పిల్లలు
● ఆదర్శంగా నిలుస్తున్న ఉపాధ్యాయులు
మంచిర్యాలఅర్బన్: ఇంటర్నేషనల్ సిలబస్, ఐఐటీ, నీట్ కోచింగ్ అంటూ సాగే ప్రచారానికి మారుమూల పల్లెల్లోనూ ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్ల హవా కొనసాగుతున్న రోజులివీ. ఇలాంటి పరిస్థితుల్లోనూ కొందరు ఉపాధ్యాయులు తమపిల్లలను సర్కారు బడుల్లోనే చదివిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్, కేంద్రియ విద్యాలయం, మోడల్ స్కూల్, కేజీబీవీ, కోరుకొండ సైకిన్‌స్కూల్, బధిరుల ఉత్తమ పాఠశాల, జవహార్ నవోదయ పాఠశాలల్లో 21మంది పిల్లలను చేర్పించి చదివిస్తున్నారు. మరో ఐదుగురు జిల్లా, మండల పరిషత్ పాఠశాలల్లో చేర్పించారు. తాము పని చేసే స్కూల్‌లోనే చదివిస్తున్న వారు కొందరైతే.. సమీపంలోని బడిలో చదివిస్తున్న వారు మరికొందరున్నారు. ప్రైవేటు కన్నా ప్రభుత్వ పాఠశాలలే మిన్నంటూ ఆచరణలో చూపిస్తున్న ఉపాధ్యాయుల సంఖ్య పెరుగుతూ వస్తోంది.
బోధిస్తున్న చోటే..
వేమనపల్లి మండలం ముల్కలపేట్ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడు(ఎస్జీటీ) ఎం.రాజయ్య పని చేస్తున్నారు. ఈ బడిలో 58మంది పిల్లలు ఉన్నారు. రాజయ్య కూతురు తేజస్విని ఐదో తరగతి, కుమారుడు శశికిరణ్ నాలుగో తరగతి చదువుతున్నాడు. ‘నేను ప్రభుత్వ పాఠశాలలోనే చదివి ఉద్యోగం సాధించాను. ప్రైవేటు పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలలే ఉత్తమం. ప్రైవేటులో అకాడమీ బేసిక్ కాకుండా బట్టీ విధానం ఉంటుందనే విషయాన్ని గ్రహించి ప్రభుత్వ పాఠశాలలోనే ప్రవేశాలు కల్పించాం. కళ్లముందర ఉండడంతోపాటు నాణ్యమైన విద్య అందించేందుకు దోహదపడుతుంది. ఇద్దరు పిల్లలను చేర్పించాను...’ అని రాజయ్య వివరించారు