
కలిసుంటే కలదు సుఖం..
● ఉమ్మడి కుటుంబాల్లో ఆత్మీయత, ప్రేమానురాగాలు ● ఆత్మస్థైర్యంతోపాటు బలం ● ఆదర్శంగా నిలుస్తున్న పలు ఫ్యామిలీలు
కాలం మారుతోంది.. జీవితం బిజీగా మారిపోయింది. ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. చిన్న కుటుంబాలే చింతలేని కుటుంబాలు అన్న భావన నెలకొంది. దీంతో పెద్ద కుటుంబాలు విడిపోయి, ఒక్కొక్కరూ ఒక్కో చోట జీవనం సాగిస్తున్న రోజులివి. చిన్నచిన్న మనస్పర్థలు, వ్యక్తిగత ఆలోచనలు వీరిని దూరం చేస్తున్నాయి. కానీ, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ బంధాలను బలోపేతం చేస్తూ, ఆత్మస్థైర్యాన్ని పెంచుతుంది. ప్రేమ, అనురాగం, ఆత్మీయ ఆప్యాయతలకు ఇది ఒక గొప్ప వేదికగా నిలుస్తుంది. ఇప్పటికీ ఉమ్మడి కుటుంబాలు కష్టసుఖాలను పంచుకుంటూ, ఒకరికొకరు అండగా నిలుస్తున్నాయి. ఏళ్ల తరబడి ఒకే ఇంట్లో కలిసిమెలిసి జీవనం సాగిస్తూ, ఇవి సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఒకరి ఆనందంలో అందరూ భాగస్వాములవుతూ, కష్టాల్లో ఒకరికొకరు తోడుగా ఉంటూ, ఈ కుటుంబాలు సామాజిక సమతుల్యతను కాపాడుతున్నాయి. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా, ఉమ్మడి కుటుంబాల విలువను గుర్తుచేసుకోవడం అవసరం. ఇవి కేవలం కుటుంబ సభ్యులను కలిపే సంస్థానం మాత్రమే కాదు..సమాజంలో ప్రేమ, సామరస్యం, సహకార భావనలను పెంపొందించే బలమైన ఆధారాలు. ఇటువంటి కుటుంబాలు మన సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుతూ, భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి.
నాలుగు దశాబ్దాలుగా..
ఆదిలాబాద్: జిల్లాకేంద్రంలోని ఆదిత్యనగర్ కాలనీకి చెందిన నానక్ సింగ్ పరివారం ఉమ్మడి కుటుంబం. గత నాలుగు దశాబ్దాలుగా కుటుంబమంతా ఒకేచోట కలిసి ఉంటుండడం విశేషం. నానక్ సింగ్–మంజీత్ కౌర్ దంపతులకు ఆరుగురు సంతానం. అందులో నలుగురు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు. చిన్నపాటి ఇనుప వస్తువులు, పనిముట్లు చేసుకుని జీవనం సాగిస్తున్నా, పరివారమంత ఒకే దగ్గర ఆత్మీయంగా కలిసి ఉంటున్నారు. కుటుంబంలో ఒక అబ్బాయికి తప్పా అందరికీ వివాహాలు జరిగాయి. తమ మధ్య ఉన్న అనుబంధమే మా అందరిని 40 ఏళ్లుగా కలిపి ఉంచిందని నానక్ సింగ్ చెబుతున్నారు. ఎలాంటి సమస్యలు వచ్చినా, తామందరం బాధ్యతలు పంచుకుని ఆ ఇబ్బంది నుంచి బయటపడేందుకు శ్రమిస్తామని పేర్కొంటున్నారు.
చిన్ననాటి నుంచి ప్రత్యేక శ్రద్ధ
బోథ్: మండలకేంద్రానికి చెందిన రాజశేఖర్ దీప దంపతులు. వారికి పిల్లల సంఖ్య కన్నా, వారిపై పెట్టే శ్రద్ధ ముఖ్యమని నమ్మారు. మేము ఒక్కరే కావాలనుకున్నారు. ఆ ఒకరిలో అన్ని విలువలు, విజ్ఞానం, మంచి భవిష్యత్తును ఇవ్వాలని అనుకురు. సంతానంగా కూతురు రుతిక పుట్టింది. ఆమె అభ్యున్నతికి పూర్తి సమయాన్ని కేటాయిస్తున్నారు. చిన్ననాటి నుంచి ప్రత్యేక శ్రద్ధ కనబర్చారు. ఇటీవల విడుదలైన లాసెట్ ఫలితాల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంకు వచ్చింది. చిన్న కుటుంబం వల్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చామని అనుకుంటున్నాం.

కలిసుంటే కలదు సుఖం..