
నకిలీ పోలీసుల ముఠా అరెస్ట్
● అదుపులో నలుగురు, పరారీలో ఒకరు ● కారు, బైక్, ఆటో బంగారు, వెండి స్వాధీనం
ఇచ్చోడ: నకిలీ పోలీసుల ముఠాను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఇచ్చోడ సీఐ కార్యాలయంలో గురువారం ఈ మేరకు వివరాలు వెల్లడించారు. నల్గొండ జిల్లా నిడమనూర్ గ్రామానికి చెందిన షేక్ ఇర్ఫాన్ (పశువుల వ్యాపారి), చింతల చెరువు ప్రశాంత్(లారీ క్లీనర్), బదనపూరి అజయ్(మోటార్ మెకానిక్) బొప్పరం సుధాకర్(సెల్ పాయింట్), ఒట్కురి నరేష్ (పెట్రోల్ బంక్ ఉద్యోగి) ఐదుగురు ముఠాగా ఏర్పడ్డారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ ఎస్సై పేరు చెప్పి వివిధప్రాంతాల్లో బంగారు వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్నారు. గతనెల 27న రంగారెడ్డి జిల్లాకు చెందిన కొండోజు నరసింహచారికి ఫోన్ చేసి ఇచ్చోడ ఎస్సై నర్సిరెడ్డి అని పరిచయం చేసుకున్నాడు. నాలుగేళ్ల క్రితం 11 గ్రాముల బంగారం కొన్నారని కేసు కాకుండా ఉండాలంటే గూగుల్ పే ద్వారా డబ్బులు పంపాలని డిమాండ్ చేశారు. అనుమానం వచ్చిన నరసింహచారి తనకు ఫోన్ చేసిన వ్యక్తి నకిలీ ఎస్సైగా గుర్తించి ఇచ్చోడ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈనెల 4న హైదరాబాద్‌కు చెందిన రుద్రంగి కిరణ్ కుమార్‌కు ఫోన్ చేసి ఇచ్చోడ ఎస్సై నర్సిరెడ్డి మాట్లాడుతున్నట్లు చెప్పి, దొంగ బంగారం కొన్నారని బెదిరించి సదరు వ్యక్తి నుంచి రూ1.50 లక్షలు వసూళ్లు చేశారు. అనుమానం వచ్చిన కిరణ్‌కుమార్ సైతం ఇచ్చోడలో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నకిలీ ఎస్సై అంటూ మోసాలకు పాల్పడుతున్న ముఠా సభ్యుల్లో నలుగురిని మండల కేంద్రంలో పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. ఒట్కురి నరేశ్ పరారీలో ఉన్నారు. వీరిపై గతంలో నల్గొండ, హుజుర్‌నగర్ పోలీస్టేషన్లలో కేసులు నమోదై ఉన్నవి. హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్, బెంగళూరు, చైన్నె నగరాల్లోని ఆభరణాల షాపుల యజమానులకు ఫోన్ చేసి బెదిరించి దాదాపు రూ.18 లక్షలు వసూలు చేసి జల్సాలకు వాడుకున్నట్లు తేలింది. నిందితుల నుంచి కారు, ఆటో, బంగారు, వెండిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. సమావేశంలో ఉట్నూర్ ఏఎస్పీ కాజల్‌సింగ్, ఇచ్చోడ సీఐ బండారి రాజు, ఎస్సై పురుషోత్తం పాల్గొన్నారు.