
చెన్నూర్‌లో ఇసుక బజార్
చెన్నూర్: చెన్నూర్ పట్టణంలో త్వరలో గోదావరి ఇసుక బజార్ ఏర్పాటు చేయనున్నట్లు మైనింగ్ ఏడీ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. బుధవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఆయన టీజీఎండీసీ పీవో శ్రీకాంత్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. బతుకమ్మ వాగు ఇసుక నాణ్యత లేకపోవడంతో గోదావరి ఇసుకకు డిమాండ్ ఉందన్నారు. వంద పడకల ఆసుపత్రి భవనం వెనుక ప్రభుత్వ స్థలంలో సాండ్ బజార్ ఏర్పాటు చేస్తామన్నారు. పీవో శ్రీకాంత్ మాట్లాడుతూ కొల్లూరు, ఎర్రాయిపేట గోదావరి నదుల నుంచి ఇసుక తీసుకొచ్చి స్టాక్ యార్డులో నిల్వ ఉంచుతామని తెలిపారు. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకొన్న వారికి ట్రాక్టర్ల ద్వారా సరఫరా చేస్తామని చెప్పారు. నాణ్యమైన ఇసుక టన్నుకు రూ.500 వరకు ఉండే అవకాశం ఉందన్నారు. గృహ నిర్మాణాలు నిలిచి పోకుండా వీలైనంత త్వరలోనే ఇసుకను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కార్యాచరణ పూర్తి చేసినట్లు తెలిపారు.