
ఎస్టీపీపీని అగ్రగామిగా నిలపాలి
● సింగరేణి డైరెక్టర్(పా) గౌతమ్
జైపూర్: విద్యుత్ ఉత్పత్తి, నిర్వహణలో సింగరేణి థర్మల్ పవర్ ప్లాంటు(ఎస్టీపీపీ)ను దేశస్థాయిలో అగ్రగామిగా నిలపాలని సింగరేణి డైరెక్టర్(పా) గౌతమ్ పొట్రు అన్నారు. మండల కేంద్రంలోని ఎస్టీపీపీని బుధవారం ఆయన సందర్శించారు. బాయిలర్లలో సీఅండ్‌ఐ కంట్రోల్స్ ద్వారా రెండు యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియ, టర్బైన్ పనితీరును అధికారులు వివరించారు. ఎస్టీపీపీ నమూనా ద్వారా ఆయా విభాగాల్లో యంత్రాల పనితీరు, విద్యుత్ ఉత్పత్తి అంశాలు తెలియజేశారు. నూతనంగా చేపట్టిన ఎఫ్‌జీడీ పనులు, అన్యువల్ ఓవర్‌హాలింగ్ పనులను వివరించారు. 800మెగావాట్ల కొత్త ప్లాంటు నిర్మించే ప్రాంతాన్ని సందర్శించారు. అనంతరం సోలార్ ప్లాంటును పరిశీలించి పనితీరు తెలుసుకున్నారు. సాయంత్రం అడ్మిన్ భవన కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్టీపీపీ అధికారులు, ఉద్యోగుల ఉత్తమ పనితీరు ఫలితంగా వరుసగా 53అవార్డులు అందుకోవడం అభినందనీయమని అన్నారు. గౌతమ్‌ను అధికారులు, ఉద్యోగుల సంఘాల నాయకులు శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎస్టీపీపీ ఈడీ చిరంజీవి, జీఎం నరసింహారావు, వోఅండ్‌ఎం చీఫ్ జెన్‌సింగ్, సీఎంవోఏఐ బ్రాంచ్ ప్రెసిడెంట్ సముద్రాల శ్రీనివాస్, ఏజీఎంలు మురళీధర్, మదన్‌మోహన్, శ్రీనివాస్, డీజీఎం అజజుల్లాఖాన్, ఫారెస్ట్ మేనేజర్ చంద్రమణి, డీజీఎం పర్సనల్ కిరణ్‌బాబు పాల్గొన్నారు.