
‘ప్రైవేట్’ మూతబడి!
● పలు ఇంటర్ కాలేజీల పరిస్థితి ● చేతులెత్తేస్తున్న యాజమాన్యాలు ● నిర్వహణ భారమై మూసివేత ● విద్యార్థులకు తప్పని తిప్పలు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ప్రైవేట్ జూనియర్ కళాశాలలను నడపలేక పలు యాజమాన్యాలు చేతులెత్తేస్తున్నాయి. దీంతో ఆ కాలేజీల్లో చదివే విద్యార్థుల చదువుకు ఇబ్బంది కలుగుతోంది. కొంతకాలంగా ప్రైవేట్ ఇంటర్, డిగ్రీ కాలేజీల్లో విద్యా వ్యాపారంలో పోటీ పెరిగి ప్రవేశాలు తగ్గుతున్నాయి. మరోవైపు విద్యార్థుల నుంచి యాజమాన్యాలకు చెల్లించే ఫీజులూ తగ్గిపోయాయి. స్కాలర్‌షిప్‌ల ఆధారంగానే కాలేజీలు నడపాల్సి వస్తోంది. సర్కారు ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించడం ఆగిపోవడంతో విద్యార్థులు, యాజమాన్యాలకు తిప్పలు తప్పడం లేదు. జిల్లా కేంద్రంతో పాటు మందమర్రి, లక్సెట్టిపేట, చెన్నూరు, బెల్లంపల్లి పట్టణాల్లో గతంలో ఉన్న కాలేజీలు ప్రస్తుతం అందుబాటులో లేవు.
తగ్గుతున్న అడ్మిషన్లు
కోవిడ్ కన్నా ముందు వరకు ప్రైవేట్ కాలేజీలు బాగానే ఉన్నా ఆ తర్వాత పరిస్థితి మారిపోయింది. జిల్లాలో మొత్తం 10 ప్రభుత్వ, 15 ప్రైవేట్ కాలేజీలున్నాయి. జిల్లా కేంద్రంలో ఈ ఏడాది నుంచే ఓ కాలేజీ మూత పడింది. అంతకుముందు ఏడాది మరో కాలేజీది ఇదే పరిస్థితి. చాలా కాలేజీల్లో అడ్మిషన్లు తగ్గి నిర్వహణ భారంగా మారుతోంది. ప్రభుత్వ గురుకులాల్లో ఇంటర్ వరకు విద్యాసౌకర్యం కలగడంతో బడ్జెట్ కాలేజీలపై ప్రభావం పడుతోంది. ఇక పదో తరగతి తర్వాత పాలిటెక్నిక్, ఐటీఐతో పాటు ఇతర వృత్తి విద్యా కోర్సులు, హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ ప్రాంతాల్లోని కార్పొరేట్ కాలేజీల్లోకి వెళ్తున్నారు. ఇక్కడ ప్రైవేట్, ప్రభుత్వ స్కూళ్లలో పదోతరగతి వరకు చదివినప్పటికీ స్థానికంగా కాకుండా ఇతర ప్రాంతాలకు తల్లిదండ్రులు పంపిస్తున్నారు. దీంతో ప్రైవేట్ కాలేజీల్లో చాలావరకు అడ్మిషన్ల సంఖ్య తగ్గుతోంది. మరోవైపు ప్రైవేట్ డిగ్రీ కాలేజీల్లోనూ ఇదే పరిస్థితి.