
రోడ్డెక్కిన ఆశ్రమ పాఠశాల విద్యార్థులు
కోటపల్లి: మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాల హెచ్‌ఎంను తొలగించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థినులు బుధవారం ఒక్కసారిగా రోడ్డెక్కారు. పాఠశాల వద్ద రోడ్డుపై మూడు గంటలపాటు బైఠాయించారు. మహిళా హెచ్‌ఎంను నియమించాలని, ఐటీడీఏ పీవో రావాలని నినదించారు. ఆదివాసీ సంఘాల నాయకులు జేక శేఖర్, బండి రమేశ్ విద్యార్థినులకు మద్దతునిస్తూ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. విద్యార్థినులు మాట్లాడుతూ ప్రధానోపాధ్యాయుడు అసభ్యకరంగా ప్రవరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. కోటపల్లి ఎస్సై రాజేందర్ విద్యార్థినులతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీనివ్వడంతో ఆందోళన విరమించారు. విషయం తెలుసుకున్న డీటీడీవో జనార్ధన్, ఏటీడీవో పురుషోత్తం పాఠశాలను సందర్శించి విద్యార్థినులు, ఉపాధ్యాయులతో మాట్లాడారు. హెచ్‌ఎం వైఖరిపై విచారణ జరిపారు. హెచ్‌ఎం అసభ్య ప్రవర్తనపై విద్యార్థినులు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామని అధికారులు తెలిపారు. హెచ్‌ఎంను తొలగించాలని ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు చిప్పకుర్తి శ్రీనివాస్, గోపాల్, అభిరామ్,సంజయ్, సమ్మయ్య నాయక్ డీటీడీవోకు వినతిపత్రం అందజేశారు.