
యువకుడి అదృశ్యం
ఆదిలాబాద్‌టౌన్: పట్టణంలోని మహాలక్ష్మివాడకు చెందిన మూగ నగేష్ సోమవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. తర్వాత బంధువులకు ఫోన్ చేసి తాను ఇంటికి రానని చెప్పాడు. కుటుంబ సభ్యులు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. అతని బంధువు కమలశోభ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు టూటౌన్ సీఐ కరుణాకర్‌రావు తెలిపారు.
తానూరులో వివాహిత..
తానూరు: మండల కేంద్రానికి చెందిన కటకం సోనీ (24)అదృశ్యమైనట్లు ఎస్సై షేక్ జుబేర్ తెలిపారు.. తానూరుకు చెందిన సోనీకి ఆరేళ్ల క్రితం మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన పవన్‌తో వివాహమైంది. ఇద్దరి మధ్య గొడవల కారణంగా సోనీ తన తల్లిగారి ఊరైన తానూరులో ఉంటుంది. ఈనెల 11న పవన్ తానూరుకు వచ్చి పెద్ద కుమారుడిని తీసుకుని నాందేడ్ వెళ్లిపోయాడు. అదే రోజు రాత్రి సోనీ చిన్న కుమారుడుని తీసుకొని ఇంటి నుంచి వెళ్లిపోయింది. బాధితురాలి తండ్రి గంగాధర్ సోమవారం తానూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా అదృశ్యం కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
ఇద్దరిపై కేసు
ఆదిలాబాద్‌టౌన్: నిజామాబాద్ జిల్లా జనకంపేటకు చెందిన ఎడ్ల వ్యాపారి మహ్మద్ సలీమ్ ఖురేషిని బెదిరించి రూ.20వేలు డబ్బులు వసూలు చేసిన ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు టూటౌన్ సీఐ కరుణాకర్‌రావు తెలిపారు. ఆదిలాబాద్ పట్టణంలోని ఘడియార్ మొహల్లాకు చెందిన సంటెన్న, ఖుర్షీద్‌నగర్‌కు చెందిన మజర్‌లు వ్యాపారిని బెదిరించి డబ్బులు వసూలు చేసినట్లు పేర్కొన్నారు. బాధితుడు టూటౌన్‌లో ఫిర్యాదు చేయగా సంటెన్నను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. మజర్ పరారీలో ఉన్నట్లు వివరించారు.
దాడి కేసులో ఒకరికి జైలు
ఆదిలాబాద్‌టౌన్: కులం పేరుతో దూషించి గొడ్డలితో దాడి చేసిన వ్యక్తికి ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.2వేల జరిమానా విధిస్తూ ఎస్సీ, ఎస్టీ కోర్టు ప్రత్యేక జడ్జి కుమార్ వివేక్ తీర్పునిచ్చినట్లు లైజన్ అధికారి పండరి తెలిపారు. 2022 జనవరి 31న జైనథ్ మండలంలోని గూడ గ్రామానికి చెందిన బాధితుడు మడావి రాజు తన భార్యతో కలిసి పిట్టగూడకు వెళ్లివస్తుండగా బండారి దేవన్న దారికి అడ్డుగా వచ్చి మద్యం కోసం డబ్బులు ఇవ్వాలని అడిగాడు. తనవద్ద లేవని చెప్పడంతో గొడవపడి గొడ్డలితో దాడి చేశాడు. గాయాలు కావడంతో బాధితుడు జైనథ్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా అప్పటి ఎస్సై బిట్లపెర్సెస్ కేసు నమోదు చేశారు. పీపీ రమణారెడ్డి 12 మంది సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టగా నేరం రుజువు కావడంతో జడ్జి పైవిధంగా తీర్పునిచ్చినట్లు వివరించారు.
వన్యప్రాణులను వేటాడితే కఠిన చర్యలు
రెబ్బెన: వన్యప్రాణులను వేటాడినా హాని కలిగించినా వన్య ప్రాణుల సంరక్షణ చట్టం ప్రకారం కఠిన చర్యలు తప్పవని ఇన్‌చార్జి రెబ్బెన ఫారెస్టు రేంజ్ అధికారి భానేష్ అన్నారు. ఈనెల 9న అడవి పందిని హతమార్చిన కేసులో నిందుతులను సోమవారం రిమాండ్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెబ్బెన మండలంలోని గోలేటికి చెందిన కుమురం భీంరావు, కన్నెపల్లి వెంకటేష్ అడవిపందిని వేటాడి హతమార్చినట్లు తెలిపారు. నిందితుల వద్ద నుండి అడవి పంది మాంసం స్వాదీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. సోమవారం కోర్టులో హాజరుపర్చగా 14 రోజుల రిమాండ్ విధించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీప్యూటీ ఎఫ్‌ఆర్వో చంద్రమోహన్, గోలేటి ఎఫ్‌బీవో వెంకటేష్ పాల్గొన్నారు.
గంజాయి కేసులో రెండేళ్ల జైలు
ఆసిఫాబాద్‌అర్బన్: గంజాయి సాగు చేసిన కేసులో లింగాపూర్ మండలంలోని రావునూరుకు చెందిన కోట్నాక సోముకు రెండేళ్ల జైలుశిక్ష, రూ.5వేల జరిమానా విధిస్తూ జిల్లా సెషన్స్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎంవి. రమేశ్ సోమవారం తీర్పునిచ్చినట్లు ఎస్పీ కాంతిలాల్ పాటిల్ తెలిపారు. నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన పీపీ జగన్‌మోహన్‌రావ్, ప్రస్తుత ఆసిఫాబాద్ సబ్ డివిజన్ ఏఎస్పీ చిత్తరంజన్, జైనూర్ సీఐ రమేశ్, లింగాపూర్ ఎస్సై గంగన్న, ఆసిఫాబాద్ డివిజన్ కోర్టు లైజనింగ్ అధికారి రాంసింగ్, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.