
ఉద్యాన సాగుకు చేయూత
● పండ్లు, పూలతోటల పునరుద్ధరణకు చర్యలు ● సబ్సిడీపై బిందు, తుంపర సేద్యం పరికరాలు అందజేత ● లాభదాయకమైన పంటల సాగుకు ముందుకు రావాలని సూచన
బెల్లంపల్లి: ఉద్యానవన పంటల సాగుకు ఊతం ఇవ్వడానికి ప్రభుత్వం రా యితీలు ప్రకటించింది. ఫలసాయాన్నిచ్చే మొక్క ల పెంపకానికి, కూరగా యలు, పూలమొక్కల సాగుకు, తోటల పునరుద్ధరణకు బిందు, తుంపరసేద్యం పరికరాలు అందించేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, సామాజిక వర్గాలకు చెందిన రైతులకు ప్రత్యేక రాయితీలను అమలు చేస్తోంది. ఔత్సాహిక రైతులు రాయితీ సదుపాయం సద్వినియోగం చేసుకుని లాభదాయకమైన పంటలను పండించడానికి ముందుకు రావాలని బెల్లంపల్లి ఉద్యానవన శాఖ అధికారి అర్చన కోరారు. ఉద్యాన శాఖ పథకాలు, ప్రభుత్వం కల్పించిన రాయితీ వివరాలను వెల్లడించారు.
సమీకృత ఉద్యాన అభివృద్ధి పథకం
ఈ పథకం కింద కొత్తగా తోటల పెంపకానికి ఔత్సాహిక రైతులకు ప్రభుత్వం తగిన చేయూతను అందిస్తోంది. మామిడి, నిమ్మ, జామతోటల పెంపకానికి ఎకరాకు రూ.19,200, బొప్పాయి సాగుకు రూ.7,200, డ్రాగన్ సాగుకు రూ.64,800, అరటి తోటకు రూ.16,800, పూలతోటకు రూ.8 వేలు, వయస్సు పైబడిన (20 నుంచి 30 సంవత్సరాలు) మామిడితోటల పునరుద్ధరణకు ఎకరాకు రూ.9,600, మల్చింగ్ కవర్ ఏర్పాటు చేసుకోవడానికి ఎకరాకు రూ.8వేల చొప్పున అందిస్తోంది.
రాష్ట్రీయ కృషి వికాస్ యోజన
ఈ పథకం రైతాంగానికి తగిన తోడ్పాటును అందిస్తుంది. పథకం ద్వారా అర ఎకరం విస్తీర్ణంలో శాశ్వత పందిరి నిర్మాణానికి రూ.50 వేలు ప్రభుత్వం అందిస్తుంది. ప్రస్తుత రోజుల్లో శాశ్వత పందిరిని ఏర్పాటు చేసుకుని కూరగాయలను సాగు చేయడం వల్ల పంట దిగుబడి పెరగడంతో పాటు అధిక లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
బిందు, తుంపర సేద్యం పథకం
ఉద్యానవన పంటల సాగులో బిందు, తుంపర సేద్యానికి ఎంతగానో ప్రాధాన్యత ఉంది. నీటిని పొదుపుగా వాడుకుని, మొక్కకు సరిపడా నీటిని, మోతాదుకు సరిపడా ఎరువులను బిందు, తుంపర సేద్యం ద్వారా అందించడం తేలికవుతుంది. ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం సబ్సిడీతో పరికరాలు అందించనున్నారు. బీసీ రైతులకు 90 శాతం, ఓసీ రైతులకు ఐదెకరాల వరకు 90 శాతం రాయితీని, తుంపర సేద్యం పరికరాలకు 75 శాతం రాయితీని ప్రభుత్వం వర్తింప జేసింది.
జాతీయ వెదురు పథకం
వెదురు సాగు చేయడానికి కూడా ప్రభుత్వం ప్రత్యేక రాయితీని కల్పించింది. జాతీయ వెదురు పథకం కింద రూ.24 వేలు అందించి 50 శాతం రాయితీని కల్పించింది. సాగుకు యోగ్యంకాని భూముల్లో వెదురు సాగు చేయడం వల్ల కొన్నాళ్లకు వెదురు చేతికంది లాభదాయకంగా ఉంటుంది.
రైతులు అందించాల్సిన పత్రాలు
ఆయా పథకాల ద్వారా ప్రభుత్వం నుంచి రాయితీ పొందడానికి రైతులు తగిన పత్రాలు అందజేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా రైతుకు సంబంధించిన భూమి పట్టేదారు పాసు పుస్తకం, బ్యాంకు పాసు పుస్తకం, ఆధార్‌కార్డు జిరాక్స్ పత్రాలతో పాటు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో అందజేయాలి. గరిష్టంగా ఐదెకరాల భూమి కలిగిన రైతులు ప్రభుత్వ రాయితీ పొందడానికి అర్హులు. ఆయా పథకాలకు దరఖాస్తు చేసుకోవడానికి తుది గడువు లేదు. సంబంధిత ప్రాంతాల ఉద్యానవన శాఖ అధికారులకు పత్రాలు అందజేయాల్సి ఉంటుంది.

ఉద్యాన సాగుకు చేయూత