
ఒక్క విద్యార్థి.. ముగ్గురి పర్యవేక్షణ
ఖానాపూర్: ఉపాధ్యాయుల కొరత, సౌకర్యాల లేమి వంటి కారణాలతో విద్యార్థులను ప్రభుత్వ బడులకు పంపేందుకు తల్లిదండ్రులు అంతగా ఆసక్తి చూపడం లేదు. దీంతో గ్రామాల్లో ఉన్న పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల సంఖ్య రోజురోజుకు తగ్గుతోంది. మండలంలోని అడవి సారంగాపూర్ పంచాయతీ పరిధి రాజులమడుగులోని ఐటీడీఏ ప్రాథమిక పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడితో పాటు ముగ్గురు విద్యార్థులు ఉన్నారు. కొద్దిరోజులుగా ఇద్దరు గైర్హాజరు అవుతుండడంతో ఒకే విద్యార్థి పాఠశాలకు వస్తున్నాడు. బుధవారం నిర్మల్ ఏసీఎంవో శివాజీ ఎస్సీఆర్టీ జంగు పటేల్‌తో కలిసి పాఠశాలను తనిఖీ చేశారు. ఆ సమయంలో ఒకే విద్యార్థి భీష్ము అందుబాటులో ఉన్నాడు. ఉపాధ్యాయుడితో పాటు ఇద్దరు అధికారులు కలిసి ఒక్క విద్యార్థిని పర్యవేక్షించాల్సి వచ్చింది.