
● జ్వరంతో బాలిక మృతి ● ముత్తంపేటలో విషాదం
ఏడేళ్లకే నూరేళ్లు..●
కౌటాల: ఆ బాలికకు ఏడేళ్లకే నూరేళ్లు నిండాయి. విషజ్వరం ఆ చిన్నారిని బలి తీసుకుంది. అల్లరు ముద్దుగా చూసుకుంటున్న ఒక్కగానొక్క కుమార్తె మృతితో ఆ కుటుంబంలో తీరని విషాదం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. కుమురంభీం జిల్లా కౌటాల మండలం ముత్తంపేటకు చెందిన రైపూర్ నాగేశ్వర్, జయ దంపతులకు కుమార్తె మన్విత (7), కుమారుడు ఉన్నాడు. నాగేశ్వర్ వ్యవసాయ కూలీగా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. మన్విత స్థానిక ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతోంది. మంగళవారం పాఠశాలకు వెళ్లిన బాలికకు జ్వరం రావడంతో ఉపాధ్యాయులు ఇంటికి పంపించారు. రాత్రి తల్లి స్థానిక ఆశ వర్కర్ వద్ద పారాసిటమల్ మాత్రలు అడిగి వేశారు. జ్వరం తగ్గకపోవడంతో బుధవారం కౌటాల పీహెచ్‌సీకి తీసుకెళ్లగా సిబ్బంది మందులు ఇచ్చి ఇంటికి పంపించారు. బుధవారం సాయంత్రం ఇంటి వద్ద బట్టల్లోనే మూత్రం పోసుకుని కిందపడిపోయింది. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందింది.