
వింత వ్యాధితో 17 మేకలు మృతి
భైంసారూరల్ : మండలంలోని ఇలేగాంలో కదం దత్తురాంకు చెందిన 17 మేకలు వింత వ్యాధి సోకి మృతి చెందినట్లు బాధితుడు తెలి పారు. మంగళవారం ఉదయం మేకలను మేతకోసం గ్రామ శివారులోని అడవికి తీసుకెళ్లాడు. మేత మేస్తుండగానే ఒక్కొక్కటిగా సాయంత్రం వరకు అడవిలోనే ఏడు మేకలు మృతి చెందాయి. దీంతో ఏంచేయాలో తెలియక మిగిలిన మేకలను తోలుకుని ఇంటికి వచ్చి పాకలో తోలాడు. బుధవారం ఉదయం చూసేసరికి మరో 10 మేకలు చనిపోయి ఉన్నాయి. పశువైద్యాధికారి విఠల్‌కు ఫోన్ ద్వారా సమాచారం అందించగా పరిశీలించి సీసీపీపీ(కంటైజెస్ క్యాప్ట్రెన్ ఫ్లూరో నిమోనియా)తో మృతి చెందినట్లు తెలిపారు. సుమారు రూ.2లక్షల వరకు నష్టం జరిగిందని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు కోరుతున్నాడు.