
కారు డివైడర్‌ను ఢీకొని సింగరేణి కార్మికుడు..
శ్రీరాంపూర్: సీసీసీ నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సీసీసీ ఆర్కే 5 కాలనీ రైల్వే అండర్ బ్రిడ్జీ వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తగరం సంతోష్ (37) అనే సింగరేణి కార్మికుడు మృతి చెందగా మరో కార్మికుడు మహేశ్వర్‌రెడ్డికి తీవ్రగాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి. ఆర్కే 5 గనికి చెందిన జనరల్ అసిస్టెంట్ తగరం సంతోశ్, సపోర్టుమెన్‌గా పని చేస్తున్న మహేశ్వర్‌రెడ్డి కారులో పనిమీద బయటకు వెళ్లి నాగార్జున కాలనీలో ఉన్న ఇంటికి వస్తుండగా రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద డివైడర్‌ను ఢీకొన్నారు. ఇద్దరికి తీవ్రగాయాలు కావడంతో గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం రామకృష్ణాపూర్‌లోని సింగరేణి ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సంతోష్ మృతి చెందాడు. మృతునికి భార్య రవీణా, పిల్లలు హన్సిత్, త్రిశూల్ ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై ఉపేందర్‌రావు తెలిపారు.
ఐఎన్టీయూసీ నేతల పరామర్శ
ఐఎన్టీయూసీ శ్రీరాంపూర్ బ్రాంచి ఉపాధ్యక్షుడు జెట్టి శంకర్‌రావు, ఇతర నాయకులు ఏరి యా ఆస్పత్రికి వెళ్లి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. మహేశ్వర్‌రెడ్డికి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు గరిగే స్వామి, పిన్నింటి మల్లారెడ్డి, మహేందర్‌రెడ్డి, చందుమోహన్, నంబయ్య, జగదీశ్, పాల్గొన్నారు.