
జనావాసాల్లోకి చుక్కల దుప్పి
మంచిర్యాలరూరల్(హాజీపూర్): హాజీపూర్ మండలం గఢ్‌పూర్ గ్రామ పంచాయతీలోని కవ్వాల్ టైగర్ రిజర్వు ఫారెస్ట్ పరిధిలో గల గాంధారీ ఖిల్లా సఫారీలో తిరుగాడుతున్న చుక్కల దుప్పి సోమవారం దారితప్పి బెటాలియన్ పరిసరాల్లోని నివాస గృహాల్లోకి వచ్చింది. గమనించిన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించడంతో అటవీ ప్రాంతంలోకి పంపించారు.
యువకుడిపై కత్తితో దాడి●
● ముగ్గురిపై హత్యాయత్నం కేసు
రామకృష్ణాపూర్: రామకృష్ణాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని తిమ్మాపూర్ గ్రామానికి చెందిన కొమ్మ సంతోష్‌పై అదే గ్రామానికి చెందిన దుర్గం వెంకటేష్ ఆదివారం రాత్రి కత్తితో హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇద్దరికి ట్రాక్టర్ల విషయంలో గతంలో పలుమార్లు గొడవలు జరిగాయి. పాత కక్షలను మనసులో పెట్టుకున్న వెంకటేష్ సంతోష్‌ను ఇంటికి పిలిపించి తండ్రి రాయపోశం, తల్లి శారదతో కలిసి దాడికి పాల్పడ్డారు. బాధితుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెంకటేష్, అతని తల్లిదండ్రులను సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పట్టణ ఎస్సై రాజశేఖర్ తెలిపారు.
కుమారుడిని కిడ్నాప్ చేసిన తండ్రిపై కేసు
ఆదిలాబాద్‌టౌన్: పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన మహ్మద్ ఆసిమ్–సుమేర దంపతులు గొడవలతో కొంత కాలంగా వేర్వేరుగా ఉంటున్నారు. ఆసిమ్ రెండో భార్యతో ఉంటున్నాడు. సోమవారం సుమేర వద్దకు వచ్చి తాను ఇకనుంచి నీతోనే ఉంటానని చెప్పాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో ఇంటి బయట ఆడుకుంటున్న ఆయన మూడేళ్ల కుమారుడు ఎండీ ఉమర్‌ను కిడ్నాప్ చేసినట్లు సుమేర చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు టూటౌన్ సీఐ కరుణాకర్‌రావు వివరించారు.
దస్తురాబాద్‌లో చోరీ
దస్తురాబాద్: మండల కేంద్రానికి చెందిన బోమ్మడి సంగీత ఓ అద్దె ఇంట్లో ఉంటుంది. ఆమె భర్త పోషమల్లు విదేశాలకు వెళ్లటంతో రాత్రి సమయంలో తల్లి బింగి రాజవ్వ ఇంట్లో పడుకుంటోంది. ఇదే అదునుగా భావించిన దొంగ ఆదివారం రాత్రి ఇంట్లో దూరి గ్యాస్ సిలిండర్లు, ల్యాప్‌టాప్, ఇంటి సామగ్రి దొంగిలించాడు. బాధితురాలు ఉదయం ఇంటికి వెళ్లి చూసేసరికి తాళం పగులకొట్టి ఉండడంతో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన పోలీసులు గ్రామానికి చెందిన మోతే రాజేందర్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు. నేరం అంగీకరించడంతో సామగ్రి రికవరీ చేశారు. నిందితునిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. గంటల వ్యవధిలో నిందితుడిని పట్టుకున్న కానిస్టేబుళ్లు షఫీఉద్దీన్, సమంత్‌రెడ్డిలను ఎస్సై సాయికుమార్ అభినందించారు.

జనావాసాల్లోకి చుక్కల దుప్పి