
పీహెచ్‌సీలో ప్రసవ వేదన
వేమనపల్లి: పురిటినొప్పులతో వేమనపల్లి పీహెచ్‌సీకి వెళ్తే గర్భిణీకి వైద్యం కరువైంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మహారాష్ట్రలోని సిరొంచ తాలూకా నర్సయ్యపల్లికి చెందిన కొండగొర్ల సోనియా కాన్పు కోసం మూడు నెలల క్రితం వేమనపల్లిలోని తల్లిగారింటికి వచ్చింది. పీహెచ్‌సీ వైద్యంపై నమ్మకం లేక మంచిర్యాల, చెన్నూర్ ప్రైవేట్ వైద్యుల వద్ద వైద్యపరీక్షలు చేయించుకుంటోంది. ఈ నెల 17వ తేదీన ప్రసవానికి సమయం ఇచ్చారు. కాగా బుధవారం ఉదయం పురిటినొప్పులు రావడంతో వేమనపల్లి పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. ఆస్పత్రిలో ఏ ఒక్క సిబ్బంది అందుబాటులో లేరు. గత్యంతరం లేక పీహెచ్‌సీలోని బెడ్‌పై పడుకోబెట్టగా తీవ్రమైన నొప్పులతో విలవిలలాడింది. పీహెచ్‌సీలోనే గంటసేపు వేచి చూశారు. కొంతసేపటికి గ్రామంలోనే ఉన్న కాంటిజెంట్ వర్కర్ నిర్మల వచ్చారు. వైద్యాధికారి రాజేశ్‌కు సోనియా అన్నయ్య రజినీకాంత్ ఫోన్ చేసినా స్పందించలేదు. ఇంకా ఆలస్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం అని 108 అంబులెన్స్‌లో చెన్నూర్ సివిల్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం సోనియా వైద్యుల పర్యవేక్షణలో క్షేమంగా ఉన్నట్లు భర్త స్వామి, తల్లి గౌరక్కలు తెలిపారు.