
ఇసుక లారీ పట్టివేత
బోథ్: మండల కేంద్రంలో ఇసుక తరలిస్తున్న లారీని పోలీసులు పట్టుకున్నారు. సీఐ వెంకటేశ్వర రావు, ఎస్సై ప్రవీణ్ కుమార్‌లు తెలిపిన వివరాలు.. బుధవారం నిర్మల్ జిల్లా సోఫీనగర్ నుంచి ఇసుక లారీ అనుమతి లేకుండా, రాయల్టీ చెల్లించకుండా మండల కేంద్రానికి చేరుకుంది. నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన మాజీద్ అనే వ్యక్తి మండల కేంద్రానికి చెందిన ఇజాజ్ అనే వ్యక్తికి 40 టన్నుల ఇసుక తరలిస్తున్నట్లు లారీ డ్రైవర్ తెలిపాడు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేసినా, విక్రయించినా కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు.