
భూసమస్యల పరిష్కారానికే సదస్సులు
● జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ● ఆరెపల్లిలో భూభారతి సదస్సు ● పైలట్ మండలంలో సదస్సులు ప్రారంభం
భీమారం: భూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. భూభారతి నూతన ఆర్‌ఓఆర్ చట్టం అమలుపై పైలట్ ప్రాజెక్టుగా ఎంపికై న భీమారం మండలం ఆరెపల్లి గ్రామంలో రెవెన్యూ సదస్సును సోమవారం ఆయన ప్రారంభించారు. కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ ఈ నెల 20వరకు నిర్వహించే రెవెన్యూ సదస్సుల్లో భూభారతిచట్టంపై అవగాహన కల్పించడంతోపాటు భూసమస్యలపై దరఖాస్తులు స్వీకరించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. రిజిస్ట్రేషన్, మ్యుటేషన్‌కు ముందు భూముల వివరాలు పూర్తి స్థాయిలో సర్వే చేసి మ్యాప్ తయారు చేస్తామని చెప్పారు. సాదాబైనామా దరఖాస్తులు పరిష్కరిస్తామని, వారసత్వ భూములను విరాసత్ చేసే ముందు నిర్ణీత కాలంలో సమగ్ర విచారణతోపాటు సంబంధిత వారసులకు నోటీసులు జారీ చేస్తామని తెలిపారు. కాగా, బూర్గుపల్లిలో నిర్వహించిన సదస్సులో మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాస్‌రావు, తహసీల్దార్ సదానందం, ప్రత్యేక తహసీల్దార్ కృష్ణ పాల్గొన్నారు.
కార్యదర్శిపై కలెక్టర్ ఆగ్రహం
భీమారం: మండలంలోని ఆరెపల్లి గ్రామంలో మిషన్ భగీరథ నీళ్లు సరఫరా లేక ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు సోమవారం గ్రామానికి వచ్చిన కలెక్టర్ కుమార్ దీపక్‌కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ స్పందించి సమస్య ఉన్న రెండు కాలనీలను స్వయంగా సందర్శించారు. బీసీ కాలనీకి మిషన్ భగీరథ నీరందించడం లేదని, సమీపంలోని బోరుబావికి మోటారు ఏర్పాటు చేయాలని కోరారు. కలెక్టర్ స్పందిస్తూ మిషన్ భగీరథ నీటిని సరఫరా చేస్తున్నాం కదా అని స్థానికులను ప్రశ్నించారు. పైపులైను వేయలేదని, పంచాయతీ కార్యదర్శి దేవేందర్‌రెడ్డికి ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని తెలిపారు. కలెక్టర్ వెంటనే మొబైల్ ఫోన్ ద్వారా నీటిసరఫరా విషయమై ఆన్‌లైన్‌లో పరిశీలించారు. గ్రామం మొత్తం నీటిసరఫరా చేస్తున్నట్లు రిపోర్టు ఇవ్వడంపై కలెక్టర్ గ్రామ కార్యదర్శిని ప్రశ్నించారు. ఎలాంటి సమాధానం ఇవ్వకపోవడంతో ప్రతీరోజు ఎక్కడ నుంచి వస్తున్నావని అడిగారు. చెన్నూరు నుంచి అని సమాధానం చెప్పడంతో మీ ఇంట్లో నీటిసమస్య ఉంటే ఇలాగే ప్రవర్తిస్తావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఎస్సీ కాలనీలో నీటి ఎద్దడి ఉందని తెలుపగా రెండు వీధులకు కలిపి రూ.1.10 లక్షలు మంజూరు చేస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. మూడు రోజుల్లో పనులు పూర్తి చేసి నీటిని సరఫరా చేయాలని కార్యదర్శిని ఆదేశించారు. మాజీ సర్పంచ్ రమేశ్, స్థానికులు ఉన్నారు.