
కానుకలు వద్దు.. నగదే ఇద్దాం!
● మంగళ్‌మోట్ మహిళ వినూత్న ఆలోచన ● ఆడపిల్ల పెళ్లికి వస్తువులకు బదులు నగదే ఇవ్వాలని నిర్ణయం.. ● ఆదివాసీ మహిళ ఐడియా.. జిల్లా అంతా ఆచరణ ● పెళ్లి కూతుళ్లకు నగదు ఇస్తూ అండగా నిలుస్తున్న గూడేలు
ఇచ్చోడ(బోథ్): ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం త ర్నం(బి) పంచాయతీ పరిఽ దిలోని అనుబంధ గ్రామమైన మంగళ్‌మోట్ ఆదివాసీ మహిళలు వినూత్న ఆలోచన కు శ్రీకారం చుట్టారు. ఆడపిల్లల వివాహం కుటుంబ పెద్దకు భారం కాకూడదని భావించి వివాహ సమయంలో కట్నకానుకల కింద ఇచ్చే ఇత్తడి, వెండి, స్టీల్ సామగ్రికి బదులు నగదు ఇచ్చి ఆర్థికంగా ఆదుకోవాలని నిర్ణయించారు. ఆదివాసీ మహిళలు తీసుకున్న ఈ నిర్ణయం ప్రసుతం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సంప్రదాయబద్ధంగా మారింది. ఆదివాసీ గూడేల్లో ఎక్కడ పెళ్లి జరిగినా కట్నకానుకలు తీసుకోవడం లేదు. వాటికి బదులుగా తోచినంత నగదు అందించి కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు.
వయసు చిన్నది..ఆలోచన పెద్దది
మంగళ్‌మోట్ గ్రామానికి చెందిన మెస్రం శ్రీదేవి ఐదోతరగతి నుంచి పదోతరగతి వరకు నేరడిగొండ మండలంలోని లఖంపూర్ ఆశ్రమ పాఠశాలలో చదివి ఉత్తమ మార్కులు సాధించింది. ఐటీడీఏ తరఫున హైదరాబాద్‌లోని శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్ పూర్తి చేసింది. జీఎన్‌ఎం ట్రైనింగ్ పూర్తి చేసి కొంతకాలం ప్రైవేట్ ఉద్యోగం చేసింది. 2018లో అదే గ్రామానికి చెందిన ప్రవీణ్‌తో వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం. వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. పెళ్లిళ్లలో కట్నం కింద సామగ్రి ఇస్తుండడంతో డబ్బులు వృథా అవుతున్నాయని శ్రీదేవితో పాటు పలువురు మహిళలు గుర్తించారు. ఈ మేరకు కట్నకానుకలు నిషేధించి వాటికి బదులుగా నగదు ఇవ్వడంతో పెళ్లి కూతురు ఇంటిపెద్దకు కొంత ఆర్థికంగా భరోసా ఇచ్చినట్లు అవుతుందని భావించి గ్రామస్తులకు విషయాన్ని తెలియజేసింది. గ్రామపెద్దలు సైతం ఆమెతో ఏకీభవించారు. ఇక నుంచి కట్నం కింద వస్తువులు ఇవ్వడం నిషేధమని తీర్మానించి అమలుకు శ్రీకారం చుట్టారు. ఈ ఏడాది మార్చి 3న మంగళ్‌మోట్‌లో జరిగిన వసంత వివాహానికి ఊరి ఆడపడుచులంతా కలిసి రూ.20 వేల నగదును అందజేశారు. మారుమూల గ్రామంలో తీసుకున్న ఈ నిర్ణయం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆదివాసీ గూడేల ప్రజలను ఆలోచింపజేసింది.
ఇటీవల పలుచోట్ల ఇలా..
● ఈనెల 14న సిరింకొండ మండలంలోని కోసుపటేల్‌గూడకు చెందిన యువతి వివాహం జరిగింది. గ్రామస్తులంతా కలిసి రూ.20 వేల నగదు అందజేశారు.
● ఈ నెల 20న ఇంద్రవెల్లి మండలం సమాకలో తొడసం గౌరుబాయి వివాహం కొట్నక్ దేవ్‌రావుతో జరిగింది. గ్రామస్తులు ప్రతీ ఇంటి నుంచి రూ.200 జమచేసి రూ.24,900 నగదును క ట్నకానుకలకు బదులుగా అందజేసినట్లు గ్రామ పటేల్ పెందూర్ భగవంత్‌రావు తెలిపారు.
● ఈ నెల 20న బజార్‌హత్నూర్ మండలంలోని అనంత్‌పూర్ గ్రామానికి చెందిన సేవంతకు ఇచ్చోడ మండలంలోని బొజ్జుగూడకు చెందిన నగేష్‌తో వివాహం జరిగింది. గ్రామస్తులంతా కలిసి రూ.22 వేల నగదు అందించి అండగా నిలిచారు.
గర్వంగా ఉంది
మా గూడెంలో తీసుకున్న నిర్ణయం పలు గూడేల్లో అమలు చేయడం గర్వంగా ఉంది. కాలానికి అనుగుణంగా నడుచుకోవాలి. 50 ఏళ్ల క్రితం కట్నకానుకలు లేకుండానే పెళ్లిళ్లు జరిగేవి. వరుడు వధువు ఇంటివద్ద, వధువు వరుడి ఇంటివద్ద నెలరోజులు పనులు చేసేవారు. వారి పని నచ్చితే పెద్దలు వారిద్దరికి వివాహం జరిపించేవారు.– కుంర భీంరావు, భూమవ్వ,
మంగళ్‌మోట్, గ్రామపటేల్ దంపతులు

కానుకలు వద్దు.. నగదే ఇద్దాం!

కానుకలు వద్దు.. నగదే ఇద్దాం!