● టారీఫ్ పెంపుదల ప్రతిపాదించలేదు ● ప్రస్తుత ధరల్లో ఎటువంటి మార్పూ లేదు ● టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి
హన్మకొండ: టీజీ ఎన్పీడీసీఎల్‌లో విద్యుత్ చార్జీల పెంపుపై స్పష్టత వచ్చింది. బుధవారం హనుమకొండలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి సవరణ చేసిన రిటైల్ సప్లయి వ్యాపారానికి సమగ్ర ఆదాయ ఆవశ్యకత, ధరలు, క్రాస్ సబ్సిడీ సర్ చార్జీల ప్రతిపాదనలపై బహిరంగ విచారణ జరిగింది. తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ జస్టిస్ దేవరాజు నాగార్జున్ అధ్యక్షతన జరిగిన ఈ బహిరంగ విచారణలో విద్యుత్ టారీఫ్‌ల ప్రతిపాదనలపై టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్‌రెడ్డి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి టారీఫ్ పెంపుదలపై ఎలాంటి ప్రతిపాదనలూ చేయలేదన్నారు. ప్రస్తుత ధరల్లో ఎలాంటి మార్పూ లేదని స్పష్టం చేశారు. గ్రీన్ ఎనర్జీని ఎంచుకునే సంబంధిత ఎల్‌టీ, హెచ్‌టీ వినియోగదారులకు సాధారణ టారిఫ్ కంటే యూనిట్‌కు రూ.0.66 గ్రీన్ టారీఫ్ విధింపు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఓపెన్ యాక్సెస్‌లో విద్యుత్ కొనుగోలు చేసి ఎన్పీడీసీఎల్ విద్యుత్ లైన్లు వినియోగించుకున్న వినియోగదారులకు ఎనర్జీ చార్జీల్లో 10శాతం చొప్పున స్టాండ్ బై చార్జీల విధింపును కొనసాగిస్తున్నామని తెలిపారు. టీజీ ఎన్పీడీసీఎల్ నిర్వహణకు 2025–26 ఆర్థిక సంవత్సరంలో రూ.19,814 కోట్ల ఆదాయ ఆవశ్యకత ఉంది. కాగా, ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రస్తుత టారిఫ్(టారిఫేతర ఆదాయం కలుపుకొని) రూ.9,421కోట్ల వస్తుందని అంచనా. దీంతో రూ.10,393 కోట్ల రెవెన్యూ లోటు ఏర్పడుతుంది.